సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 10:23:53

ఫిషింగ్‌ మెయిల్స్‌తో పైలం

ఫిషింగ్‌ మెయిల్స్‌తో పైలం

  • పొంచి ఉన్న సైబర్‌ నేరగాళ్లు
  • ఈ జాగ్రత్తలు మేలు: పోలీసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇటీవల సైబర్‌మోసాలు అధికమయ్యాయి. కేసులు భారీగానే నమోదవుతున్నాయి. కేసుల పరిష్కారానికి సైబర్‌ క్రైం ఠాణాలు ఏర్పాటయ్యాయి. సైబర్‌ నేరగాళ్లు ఎక్కడైనా పొంచి ఉంటున్నారు. ఫిషింగ్‌ ఈ మెయిల్స్‌ (తప్పుడు ఈ మెయిల్స్‌)తో మన డాటాను, వివరాలను సేకరించేందుకు నిత్యం వల వేస్తూనే ఉన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ ఫిషింగ్‌ మెయిల్స్‌ బారిన పడకుండా ఉండొచ్చని పోలీసులు సూచిస్తున్నారు.

తెలిసిన పేరే కదా అని మోసపోవద్దు: మీకు వచ్చిన ఈ మెయిల్స్‌లో డిస్‌ప్లేలో ఉన్న పేరు (ఈ మెయిల్స్‌ సబ్జెక్ట్‌ నేమ్‌)ను చూసి మోసపోవద్దు. ఈ మెయిల్‌ అడ్రస్‌ను పరిశీలించిన తర్వా తే లింకులను ఓపెన్‌చేయాలి. 

వెంటనే క్లిక్‌ వద్దు: ఫిషింగ్‌ మెయిల్స్‌లో టెక్ట్స్‌ సాధారణ మెయిల్స్‌కి సరిపోలకుండా ఉంటే వాటిని వెంటనే క్లిక్‌ చేయకూడద్దు. 

స్పెల్లింగ్‌ సరిచూసుకోండి: కొన్ని ఫిషింగ్‌ ఈ మెయిల్స్‌లో కొద్దిపాటి అక్షర మార్పులతో గుర్తించని విధంగా నకిలీవి సైబర్‌ దొంగలు పంపుతున్నారు. ఉదాహరణకు పీఎంకేర్స్‌ ఫండ్‌ పేరిట కొందరు సైబర్‌ నేరగాళ్లు చూడగానే అదే అర్థం వచ్చేలా కొద్దిపాటి అక్షరాల మార్పుతో నకిలీ మెయిల్స్‌ పంపి డబ్బులు దండుకున్న ఘటనలపైనా దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.

వ్యక్తిగత సమాచారం అడిగితే ఫిషింగ్‌ మెయిల్సే: ప్రముఖ కంపెనీల పేరిట వచ్చే ఈ మెయిల్స్‌లో కొందరు సైబర్‌ కేటుగాళ్లు వ్యక్తిగత వివరాలు అడుగుతుంటారు. వాస్తవానికి కంపెనీలు వ్యక్తిగత సమాచారం అడుగవు. 

తొందర పెడుతున్నారా..: ఈ మెయిల్స్‌ లో ఎవరైనా ఫలానా సమయంవరకు డబ్బు జమచేలని తొందరపెడితే అది ఫిషింగ్‌ మెయిలే. 

సంతకాలను సరిచూసుకోవాలి: ఈ మెయిల్స్‌లో వచ్చే సంతకాలను సరిచూసుకోవాలి. ప్ర ముఖుల పేరిట ఫిషింగ్‌ మెయిల్స్‌ పంపొచ్చు.

అటాచ్‌మెంట్స్‌తో భద్రం: ఈ మెయిల్స్‌లో వచ్చే అటాచ్‌మెంట్‌ ఫైల్స్‌ను ఓపెన్‌ చేయడంలో నూ జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు ప్రముఖ కంపెనీలు, బ్యాంకులు, ఉద్యోగావకాశాల పేరిట ఫిషింగ్‌ ఈ మెయిల్స్‌ పంపుతున్నారు.

కనిపించే ప్రతిదీ నమ్మొద్దు: మీకు వచ్చే ఈ మెయిల్స్‌లో ఏదైనా సమాచారం అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే తేరుకోండి. వాటిని ఓపెన్‌చేయకపోవడమే ఉత్తమం.


logo