మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 21:20:47

ఉద్యోగాల పేరిట రూ.45 లక్షలకు పైగా టోకరా

ఉద్యోగాల పేరిట రూ.45 లక్షలకు పైగా టోకరా

జమ్మికుంట : పెద్దగా కష్టపడనక్కర్లేదు. గల్ఫ్‌ దేశంలో ఉద్యోగం. ఏసీ ప్రదేశం. రూ.లక్షా 50 వేలిస్తే చాలు.. లక్షలల్లో జీతం. జీవితం మారిపోతుందని నమ్మబలికాడో ప్రబుద్దుడు. 30 మందికి పైగా దగ్గర రూ.45 లక్షల నగదు వసూలు చేసి పక్క దేశానికి పరారయ్యాడు. విషయం తెలుసుకుని లబోదిబోమన్న బాధిత కుటుంబాలు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి గల్ఫ్‌ దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడెనిమిది నెలల క్రితం జమ్మికుంటకు వచ్చాడు. తన సమీప బంధువులు, స్నేహితులు, తదితర వ్యక్తులను కలిశాడు. తాను ఉద్యోగం చేస్తున్న దేశంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తెలుసని, అతడు ఎయిర్‌ పోర్టులో ఉద్యోగాలు పెట్టిస్తున్నాడని తెలిపాడు. పోర్టులో సూపర్‌వైజర్‌, డ్రైవర్‌, తదితర ఉద్యోగాలను చూపాడు. రూ.లక్షా 50 వేలిస్తే చాలు ఉద్యోగంలో చేరిపోవచ్చని, లక్షల జీతం చేతికొస్తుందని నమ్మబలికాడు. 

నిరుద్యోగులు ఆశ పడ్డారు. అప్పుసప్పు తెచ్చి నగదు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఉద్యోగాల పేరిట 20 నుంచి 40 మంది వద్ద లక్షల్లో నగదును తీసుకున్నాడని సమాచారం. రెండు విడుతలుగా డబ్బును పరిచయస్తునికి పంపినట్లు తెలిసింది. ఇక తర్వాత జాడపత్తా లేకుండా పోయాడు. కొద్ది రోజుల తర్వాత కొందరికి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పత్రాలు వాట్సాప్‌ చేసినట్లు సమాచారం. అవి ఫేక్‌ అని తేలడంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. నగదు తీసుకున్న వ్యక్తిపై, అతడి కుటుంబంపై బాధితులు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో గల్ఫ్‌లో ఆంధ్రాకు చెందిన వ్యక్తి చేతిలో తానూ మోసపోయానని, డబ్బులు తీసుకున్న వ్యక్తి బాధితులకు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్పందించడం లేదని తెలిసింది. దీంతో ఇటీవల కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


logo