గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 25, 2020 , 06:35:59

‘వన సంరక్షణ సమితి’ పేరుతో మోసం..

‘వన సంరక్షణ సమితి’ పేరుతో మోసం..

బంజారాహిల్స్‌ :  వన సంరక్షణ సమితి పేరుతో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలో సభ్యులకు ఇండ్ల స్థలాలంటూ మోసం చేసి రూ.25లక్షలు వసూలు చేశారంటూ సమితి అధ్యక్షుడిపై బాధితులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బాధితుల కథనం ప్రకారం.. కృష్ణానగర్‌లో నివాసముంటున్న కృష్ణ ప్రసాద్‌ అనే వ్యక్తికి మూడేండ్ల కిందట కిషన్‌చంద్‌ అనే వ్యక్తి ద్వారా జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో నివాసముంటున్న నెల్లూరుకు చెందిన ‘వన సంరక్షణ సమితి’ అధ్యక్షుడు నట్టం సుబ్బారావు పరిచయమయ్యాడు. మొక్కలు నాటడంతో పాటు అవగాహన  కార్యక్రమాలు చేపట్టేందుకు తమ సంస్థ ద్వారా కృషి చేస్తున్నామని కృష్ణ ప్రసాద్‌కు చెప్పిన సుబ్బారావు అతడిని కూడా సభ్యుడిగా చేరాలని సూచించారు. దీంతో సంస్థలో చేరిన కృష్ణప్రసాద్‌ కొన్ని రోజుల తర్వాత భార్య సరితతో పాటు  అశోక్‌ బాబు అనే వ్యక్తిని కూడా చేర్పించాడు. తాము చేస్తున్న సేవలకు గుర్తింపుగా గతంలో సీఎంగా పనిచేసిన వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మాదాపూర్‌లోని  అయ్యప్ప సొసైటీకి సమీపంలో 5 ఎకరాల స్థలం కేటాయించారని, ఈ స్థలాన్ని వన సంరక్షణ సమితిలో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్లాట్లుగా చేసి కేటాయిస్తామని సుబ్బారావు చెప్పారు.   అత్యంత ఖరీదైన మాదాపూర్‌ ప్రాంతంలో 100 గజాల స్థలం విలువ సుమారు రూ. కోటి ఉంటుందని దాన్ని రూ.25లక్షలకే వన సంరక్షణ సమితి సభ్యులకు ఇస్తామని నమ్మించారు. దీంతో  తనతో పాటు భార్య సరిత, అశోక్‌బాబు అనే వ్యక్తి పేరుతో మూడు ప్లాట్లు బుకింగ్‌ చేయించిన కృష్ణ ప్రసాద్‌ సుబ్బారావు సూచించిన విధంగా  పలు దఫాలుగా మొత్తం రూ. 25 లక్షలను చెల్లించారు. 


మిగిలిన డబ్బులను రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇవ్వాలని, రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత పట్టాలను ఇస్తారని పేర్కొన్నారు. అయితే నెలలు గడిచినా స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయకపోగా కనీసం సరైన పత్రాలను చూపించాలని  కోరినా స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన కృష్ణ ప్రసాద్‌.. సోమవారం పలువురు బాధితులతో కలిసి జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లోని ఓ ఐపీఎస్‌ అధికారి ఇంట్లో నివాసముంటున్న సుబ్బారావు ఇంటి వద్దకు వెళ్లాడు. డబ్బులు ఇవ్వాలంటూ వారంతా ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన ఇంటివద్దకు వచ్చి కొంతమంది వ్యక్తులు న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారంటూ సుబ్బారావు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేసి పీఎస్‌కు తీసుకువచ్చారు. తమను మోసం చేసిన సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కృష్ణప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇరువర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo