మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 21:00:09

తెలంగాణ వ్యవసాయానికి నాలుగు రకాల వ్యూహాలు : సీఎం కేసీఆర్‌

తెలంగాణ వ్యవసాయానికి నాలుగు రకాల వ్యూహాలు : సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్ : తెలంగాణ వ్య‌వ‌సాయ బాగుకు నాలుగంచెల వ్యూహాలను రూపొందించుకోవాలని వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌కు సీఎం కేసీఆర్‌ సూచించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి స‌మీక్షా సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ రైతు సంక్షేమ బాధ్యతను భుజాన వేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈ దిశగా సరియైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఇందులో భాగంగా నాలుగంచెల వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు.  రైతులు సరియైన ధరలు వచ్చే పంటలను మాత్రమే పండించేందుకు ప్రణాళికలను తయారు చేయడం,  కల్తీ విత్తనాలు మార్కెట్ లో లభ్యం కాకుండా జాగ్రత్త పడుతూ నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయడం, సరియైన సమయంలో ఎరువులను అందించడం, రైతు పండించిన పంటకు మంచి ధరలు లభించేలా చూడడం. ఈ నాలుగు రకాల మార్కెటింగ్ వ్యూహాలను పటిష్టంగా అమలు పరచాల్సి ఉంటుంద‌ని అధికారులకు సీఎం వివరించారు. వీట‌న్నిటి స‌మ‌న్వ‌యంతో మాత్రమే అది గొప్ప వ్యవసాయంగా మారుతుందన్నారు. తెలంగాణ ఏమి తింటుందో.. మార్కెట్లో ఏ పంటకు ధర వస్తుందో  తెలుసుకోని అందుకు అనుగుణంగా పంటలను పండించాల్సి ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయరంగంలో సాంకేతికతను, యాంత్రీకరణను విరివిగా ఉపయోగించాలన్నారు. ఆ దిశగా రైతాంగాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం సూచించారు.  

వ్యవసాయశాఖ మరింత డైనమిక్‌గా పనిచేయాలి :

తెలంగాణ రైతాంగానికి బాసటగా నిలిచి పనిచేయాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదేనని సీఎం అన్నారు. ప్రజల సంఘటిత శక్తిలో అద్భుతమైన బలం ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి వారిని ఐక్యం చేయాలన్నారు. 65 శాతం ప్రజలు  వ్యవసాయం దాని అనుబంధ వృత్తుల మీదనే ఆధారపడి వున్నారన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో వ్యవసాయశాఖ అధికారులదే  ప్రధాన పాత్ర అని సీఎం తెలిపారు. వ్య‌వ‌సాయ‌శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సరియైన దిశగా ప్రణాళికలు సిద్దం చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవ‌న్నారు. నియంత్రిత సాగును పకడ్బందీగా అమలుపరిచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి, అగ్రికల్చర్ ఎస్ఈజెడ్ లను ఏర్పాటు చేసి, తెలంగాణ రైతన్న పండించిన పంటలకు ఎక్కడికక్కడ మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరిచి వారి పంటలకు అధిక ధరలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ మీద ఉంద‌ని సీఎం పేర్కొన్నారు.


logo