శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 21:38:32

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులను మింగిన చెరువు

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులను మింగిన చెరువు

  • స్నానానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
  • నారాయణపేట జిల్లాలో విషాదం

మహబూబ్‌నగర్‌ :  నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. మొగల్ మడక  గ్రామ పంచాయతీ పరిధిలోని నంద్యా నాయక్‌ తండాలో శుక్రవారం  సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాలివి.. నంద్యానాయక్ తండాకు చెందిన ఓ వృద్ధుడు గురువారం హైదరాబాద్‌లో మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకువచ్చిన కుటుంబీకులు శుక్రవారం నంద్యా నాయక్ తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలు పూర్తయిన అనంతరం మృతుడి మనువళ్లైన ఐదుగురు చిన్నారులు స్నానం చేసేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు.

చెరువులోకి దిగిన నలుగురు చిన్నారులు ఈత రాక ఒకరి తర్వాత ఒకరు నీట మునిగారు. వీరితో వెళ్లిన మరో బాలుడు ఒడ్డునే ఉండటంతో ఆందోళనకులోనై తండాకు వచ్చి కుటుంబీకులకు విషయం చెప్పాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టగా అప్పటికే చిన్నారులు మృతి చెందారు. మృతులను అర్జున్‌ నాయక్(13), అరుణ్‌ నాయక్ (11), గణేశ్ నాయక్ (12), ప్రవీణ్‌ నాయక్ (12)  గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులను కోల్పోవడంతో ఆయనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడటంతో తండాలో విషాదం అలుముకుంది. చిన్నారుల తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.