గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 17:01:05

న‌గ‌లు మాయం కేసులో న‌లుగురు అరెస్ట్‌

న‌గ‌లు మాయం కేసులో న‌లుగురు అరెస్ట్‌

హైద‌రాబాద్ : బ‌ంజారాహిల్స్‌లో బంగారు న‌గ‌లు మాయం చేసిన కేసులో న‌లుగురు నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్లు హైద‌రాబాద్ సీపీ అంజ‌నీ కుమార్ వెల్ల‌డించారు. నిందితుల నుంచి రూ. కోటి విలువ చేసే బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌ధాన నిందితుడు నిరంజ‌న్‌తో పాటు ప‌వ‌న్‌, వెంక‌ట్‌, రంజిత్‌ను అరెస్టు చేశామ‌న్నారు. ఈ న‌లుగురు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాకు చెందిన వార‌ని తెలిపారు. 

అసలేం జ‌రిగింది?

ఈ నెల 9వ తేదీన ఓ క‌స్ట‌మ‌ర్‌కు న‌గ‌లు చూపించేందుకు సేల్స్‌మెన్ బ‌షీర్‌బాగ్‌లోని వీఎస్ గోల్డ్ షాపు నుంచి జూబ్లీహిల్స్‌లోని కృష్ణ పెర‌ల్స్‌కు బ‌య‌ల్దేరాడు. అయితే బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్‌-3 మార్గంలో న‌గల‌ను స్కూట‌ర్‌పై తీసుకెళ్తుండ‌గా, కిడ్స్ స్కూల్ వ‌ద్ద‌కు రాగానే వ‌ర‌ద నీటిలో న‌గ‌ల సంచి కొట్టుకుపోయింది. ఆ మ‌రుస‌టి రోజు ఖాళీ సంచి మాత్ర‌మే ల‌భ్య‌మైంది. దీంతో వీఎస్ గోల్డ్ షాపు య‌జ‌మాని బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మొబైల్ స్విచ్ ఆఫ్ టెక్నాల‌జీ స‌హాయంతో నిందితుల‌ను ప‌ట్టుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

కిడ్స్ స్కూల్ ప‌రిస‌రాల్లో నివాస‌ముంటున్న వ్య‌క్తుల‌కు సంచి క‌న‌బ‌డ‌టంతో.. దాంట్లో ఉన్న న‌గ‌ల‌ను తీసుకుని సంచిని అక్క‌డే వ‌దిలేశారు. న‌గ‌ల‌ను తీసుకుని బంధువుల‌తో క‌లిసి నాగర్‌క‌ర్నూల్‌కు వెళ్లిన‌ట్లు పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి మొత్తం న‌గ‌ల‌ను పోలీసులు రిక‌వ‌రీ చేశారు.