సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 02:46:44

కొత్తగా నాలుగు మైనింగ్‌ ప్లాన్లు

కొత్తగా నాలుగు మైనింగ్‌ ప్లాన్లు

  •  రూ.3.65 కోట్లతో కార్మికులకు యూనిఫాంలు
  •  మూడోదశ సోలార్‌ప్లాంట్ల నిర్మాణాలకు అనుమతి
  •  సింగరేణి బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు

మంచిర్యాల, నమస్తే తెలంగాణ: నాలుగు భూగర్భ గనుల మైనింగ్‌ ప్లాన్లకు అనుమతినిస్తూ సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. భూగర్భ గనుల విస్తరణలో భాగంగా కాసిపేట, ఆర్‌కే 1 ఏ, శ్రీరాంపూర్‌ 3, 3ఏ గనుల మైనింగ్‌ ప్లాన్లకు అనుమతి ఇచ్చారు. శనివారం ఆ సంస్థ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ అధ్యక్షతన 555వ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను ఆయన వెల్లడించారు. కార్మికుల కోసం రూ.3.65 కోట్లతో యూనిఫాం వస్ర్తాన్ని తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ నుంచి నామినేషన్‌ పద్ధతిలో కోనుగోలు చేయనున్నట్టు తెలిపారు. నిర్దేశించుకున్న అధికోత్పత్తి లక్ష్యాల సాధనకు అనుగుణంగా కొత్తగూడెం ఏరియా పరిధిలో మరో ఓపెన్‌ కాస్టు గని నిర్మాణానికి బోర్డు నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు. ‘రాబోయే రెండేండ్లకు ఓసీ గనుల్లో వాడే పేలుడు పదార్థాల కొనుగోలుకు, కంపెనీ నిర్వహిస్తున్న పేలుడు పదార్థాల ఉత్పత్తి ప్లాంట్లకు కావాల్సిన అమ్మోనియం నైట్రేట్‌, రూఫ్‌బోల్టుల కొనుగోలు తదితర పనులకు బోర్డు అంగీకారం తెలిపింది. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టిన 300 మెగావాట్ల సోలార్‌ పవర్‌ప్లాంట్‌లలో చివరిదైన మూడోదశ నిర్మాణం పనులను అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. మూడోదశలో భాగంగా సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వాటర్‌ రిజర్వాయర్లపై 10 మెగావాట్లు, మూతపడిన బెల్లంపల్లి డోర్లీ ఓపెన్‌కాస్టుగని క్వారీనీటిపై 5 మెగావాట్ల సామర్థ్యంతో నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్లతోపాటు కొత్తగూడెం, చెన్నూరులో నేలపై నిర్మించే సోలార్‌ ప్లాంట్‌, ఆర్‌జీ ఓసీ 1, డోర్లీ ఓసీ 1 ఓవర్‌ బర్డెన్‌ డంప్‌ల మీద నిర్మించే సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం పనుల అప్పగింత ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సింగరేణి డైరెక్టర్లు ఎస్‌ చంద్రశేఖర్‌, ఎన్‌ బలరాం, డీ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.logo