గురువారం 09 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:36

గ్రేటర్‌లో లింకు రోడ్లు

గ్రేటర్‌లో లింకు రోడ్లు

  • హైదరాబాద్‌లో మరింత మెరుగ్గా ప్రజా రవాణా
  • 4 కారిడార్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించే చర్యల్లో భాగంగా నాలుగు ప్రధాన లింక్‌ రోడ్లను రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో  హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్డీసీఎల్‌) సుమారు రూ. 33.80 కోట్ల వ్యయంతో 4.67కిలోమీటర్ల మేర ఈ కారిడార్లను నిర్మించింది. ఈ లింక్‌ రోడ్లతో ప్రధానంగా హైదరాబాద్‌-సైబరాబాద్‌ మధ్య వాహనాల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. వచ్చే నెలాఖరునాటికి మరో 33 లింక్‌ రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్డీసీఎల్‌ యంత్రాంగం సమర్థంగా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాయి. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగాలు జంటనగరాల్లో 137 లింక్‌ రోడ్లు అవసరమని గుర్తించాయి. 

ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే సుమారు 126.2 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, ఎస్కే జోషి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఎంఎల్‌ఏ దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింక్‌ రోడ్డు వెంట మంత్రులు, అధికారులు మొక్కలు నాటారు.


logo