సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 01:42:54

కళతప్పిన కల్యాణం!

కళతప్పిన కల్యాణం!

-వెంటాడుతున్న కరోనావైరస్‌ భయం 

-పెండ్లిళ్లకు హాజరుకాని బంధువులు

-మాస్కులతో హాజరవుతున్న ఆప్తులు

-వేల సంఖ్యలో వివాహాలు వాయిదా 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆకాశమంత పందిరివేసి, భూదేవంత పీటవేసి ఊరంతా చెప్పుకొనేలా పెండ్లి చేసుకుందామంటే వచ్చేవాళ్లు లేరు! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌.. గుమికూడినచోట అంటుకుంటుందనే వాస్తవం ఎవరినీ బయటకు అడుగుపెట్టనివ్వడం లేదు. కరోనా బా ధితులకు చికిత్స అందించే కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఉన్నందున.. ఇక్కడి పెండ్లిళ్లకు హాజరయ్యేందుకు బంధువులు సుముఖత చూపడంలేదు. ఇప్పటికే అన్నిఏర్పాట్లు చేసుకొన్న జంటలు మాత్రం ఆప్తుల మధ్య వివాహతంతును మమ అనిపిస్తున్నాయి. గురువారం హైదరాబాద్‌లో మూడువేలకుపైగా పెండ్లిళ్లు జరుగాల్సి ఉన్నది. 90 శాతం మంది వివాహ వేడుకను వాయిదా వేసుకున్నారు. దీంతో పదుల సంఖ్యలోనే పెండ్లిళ్లు జరిగాయి. ఈ వేడుకల్లోనూ బంధువులు పలుచగానే కనిపించారు. బహుమతులను తీసుకొనేందుకు సైతం వధూవరులు భయపడ్డారు. దాదాపు వెయ్యిమందిని అంచనావేసి ముందే తీసుకున్న ఫంక్షన్‌హాల్‌, దానికి తగ్గట్టుగా అలంకరణ కోసం వెచ్చించిన లక్షల రూపాయల ఖర్చు వృథా అయ్యిందనే భావన వ్యక్తమయింది. తప్పదనుకొని పెండ్లిళ్లకు హాజరవుతున్నవారికి మండపంలోకి రాగానే చేతులు శుభ్రం చేసుకొనేందుకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. 

బోధన్‌లో నాలుగు ఫంక్షన్‌ హాళ్లు సీజ్‌

ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని నాలుగు ప్రధాన ఫంక్షన్‌హాళ్లను అధికారులు గురువారం సీజ్‌చేశారు. వేడుకలకు 200 మందికి మించి హాజరుకావద్దని ఆదేశాలు ఉన్నా.. వేల మం దితో ఫంక్షన్‌ నిర్వహిస్తుండటంతో రమాకాంత్‌ ఫంక్షన్‌హాల్‌ను, రవి గార్డెన్స్‌, ఆచన్‌పల్లిలోని ఆప్నా ఫంక్షన్‌ హాల్‌ను, ఏఆర్‌ గార్డెన్స్‌ను ఆర్డీవో గోపీరాం, ఏసీపీ జైపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శివానందం సమక్షం లో రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు సీజ్‌చేశారు.


logo