శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:20:22

అయ్యో బిడ్డలారా

అయ్యో బిడ్డలారా

  • చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి
  • కన్నీటి సంద్రమైన మహబూబాబాద్‌ జిల్లా బోడతండా

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ: అయ్యోబిడ్డలారా.. అప్పుడే ఆయుష్సు తీరిందా.. బడి ఉంటే బతికేటోళ్లు కదరా బిడ్డా.. కరోనా ఎంత పని చేసిందిరా.. అంటూ ఆ పిల్లల తల్లిదండ్రుల రోదన అక్కడున్నవారిని కన్నీరు పెట్టించింది. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లా శనిగపురం జీపీ పరిధిలోని బోడతండాలో శనివారం సాయంత్రం చోటుచేసుకొన్నది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన బోడ లాల్‌సింగ్‌-జ్యోతిల మొదటి కుమారుడు బోడ దినేశ్‌(12) ఆరోతరగతి, బోడ హరి-నీలా దంపతుల చిన్నకుమారుడు జగన్‌(10) నాలుగో తరగతి.. ఇస్తావత్‌ నందు, లక్ష్మిల ప్రథమ కుమారుడు లోకేశ్‌ (13) 7వ తరగతి.. ఇస్లావత్‌ రాకేశ్‌, మంగమ్మల చిన్నకుమారుడు రాకేష్‌(9) 4వ తరగతి చదువుతున్నారు. కోవిడ్‌ కారణంగా పాఠశాల మూసివేయడంతో అందరు ఇంటివద్దనే ఉంటున్నారు. 

ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తండా సమీపంలోని  తుమ్మల చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులోకి దిగాక.. లోకేశ్‌  నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడడానికి వెళ్లిన మిగిలిన ముగ్గురూ  నీటిలో మునిగిపోయారు. వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన లోకేశ్‌ తల్లి లక్ష్మి ఇంటి వద్ద కొడుకు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారిని ఆరా తీసింది. అందరూ తెలియదని చెప్పడంతో అనుమానం వచ్చిన లక్ష్మి చెరువు వైపు వెళ్లింది. అక్కడ మేకలుకాస్తున్న వారిని అడుగగా చెరువువైపు వెళ్లారని చెప్పారు. దీంతో ఆమె చెరువు వద్దకు వెళ్లగా ఒడ్డున బట్టలు కనిపించాయి. కొడుకు కనిపించకపోవడంతో బోరున విలపించింది. తండావాసులు చెరువు వద్దకు చేరుకున్నారు. ఈతగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ఇందులో ఇస్తావత్‌ లోకేశ్‌, ఇస్లావత్‌ రాకేశ్‌ ఇద్దరు సొంత అన్నదమ్ముల కుమారులు.

ప్రాణాలు తీసిన ఈత సరదా 

నిత్యం ఆ చెరువు వద్దకు కొందరు పెద్దవాళ్లు చేపలు పట్టడానికి, మరికొందరు ఈత కొట్టడానికి వేళ్లేవారు. అప్పుడప్పుడు పెద్దవాళ్లతో ఈ నలుగురు పిల్లలు వెళ్లేవారు. శనివారం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో నలుగురు కలిసి చెరువు వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కొడుదామని చెరువులోకి దిగారు. ఒకరు మునిగిపోతుండగా అతడిని కాపాడడానికి ఒకరివెనక మరొకరు వెళ్లి చెరువులో మునిగిపోయారు.  పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. logo