ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:48:56

నీరా కేఫ్‌కు 23న శంకుస్థాపన

నీరా కేఫ్‌కు 23న శంకుస్థాపన

  • నెక్లెస్‌రోడ్డులో అత్యాధునిక హంగులతో నిర్మాణం
  • ఏర్పాట్లపై సమీక్షించిన ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • గౌడకుల ప్రజాప్రతినిధులకు పత్రికాముఖంగా ఆహ్వానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలోనే అత్యాధునిక హంగులతో నెక్లెస్‌రోడ్డులో నిర్మించతలపెట్టిన నీరా కేఫ్‌కు 23న శంకుస్థాపన చేయనున్నట్టు ఎక్సైజ్‌, టూరిజంశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లపై శుక్రవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. నీరాకేఫ్‌ ప్రతిపాదిత నమూనాను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీరాపాలసీ ప్రవేశపెట్టడంతోపాటు, గౌడ కులస్తులే నీరా గీసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజతలు తెలిపారు. గత పాలకుల హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు ముఖ్యమంత్రి పూర్వవైభవం తీసుకొస్తున్నారని చెప్పారు. నీరాకేఫ్‌ శంకుస్థాపనకు గౌడ సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులను అహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిపారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, వివేకానందగౌడ్‌, శాసనమండలి మాజీచైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, పలువురు జెడ్పీ చైర్మన్లు, కులసంఘాల నాయకులు, జేఏసీ నాయకులను పత్రికాముఖంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి గౌడసోదరుడు కనీసం మూడు ఈత, తాటి, గిరుక తాళ్లు(డాలర్‌ ట్రీ)ను నాటి గీతవృత్తిని కాపాడుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్‌, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్‌, గౌడ ఐక్యసాధనసమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్‌, పర్యాటకశాఖ ఎండీ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.logo