ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 23:16:58

పత్తి విక్రయించేందుకు తొందరపడొద్దు : మంత్రి జగదీశ్‌రెడ్డి

పత్తి విక్రయించేందుకు తొందరపడొద్దు : మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండ : పత్తి విక్రయానికి రైతులు తొందర పడొద్దని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. సీసీఐ కేంద్రాలు ప్రారంభించేంత వరకు ఓపిక పడితె మద్దతు ధర వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఉమ్మడి జిల్లాలో రైతులు పండించిన పత్తి, ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధమవుతున్నారని చెప్పారు. వానాకాలం ధాన్యం కొనుగోలుపై నల్గొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మార్కెట్‌కు రానున్న ధాన్యం, సన్నాల దిగుబడి, పౌర సరఫరాలశాఖ కొనుగోలు, ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రైస్ మిల్లర్లకు ధాన్యం కొనుగోలు కేటాయింపులతోపాటు ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. 

గత యాసంగిలో ధాన్యం కొనుగోలులో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటిస్థానంలో నిలువడంతో అధికారులను ఆయన అభినందించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 లక్షల మెట్రిక్  టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనాలుండగా 858 కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. జిల్లాల వారీగా నల్గొండ జిల్లాలో 275 కొనుగోలు కేంద్రాలు (4.59 లక్షల మెట్రిక్ టన్నులు) యాదాద్రి భువనగిరి జిల్లాలో 282 కొనుగోలు కేంద్రాలు( 3.65 లక్షల మెట్రిక్  టన్నులు), సూర్యాపేట జిల్లాలో 301 కొనుగోలు కేంద్రాలు ( 4.05 లక్షల మెట్రిక్ టన్నులు) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొనుగోలుకు అవసరమైన గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

టెస్కాబ్ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్రకుమార్‌, ఎన్. భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, పెళ్ల శేఖర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ రామచంద్రనాయక్, సూర్యాపేట కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్ తో పాటు జాయింట్ కలెక్టర్లు చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.

 


logo