నమ్మకస్తుడు నర్సన్న!

- నాయినికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్
- పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు
- తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా అవకాశం
నర్సన్నా.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆప్యాయంగా పిలుచుకొనే నాయిని నర్సింహారెడ్డి చివరి వరకు ఆయన వెన్నంటే నడిచారు. అత్యంత నమ్మకస్తుడు, విధేయుడిగా ఉన్న నాయినికి పార్టీలో, ప్రభుత్వంలో కేసీఆర్ అధిక ప్రాధాన్యమిచ్చారు. కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించిన నాటినుంచి నాయిని చనిపోయే వరకు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగించి గౌరవించారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలో టీఆర్ఎస్కు కేటాయించిన ఆరుగురు మంత్రుల్లో నాయిని నర్సింహారెడ్డి కూడా ఒకరు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఏర్పడ్డాక స్వరాష్ట్రంలో నాయిని తొలి హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకపోయినా.. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మరీ హోంమం త్రి బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో జాతీ య పండుగలకు, రాష్ట్ర పండుగలకు జాతీయజెండా ఎగురవేసే బాధ్యతను కూడా సీఎం కేసీఆర్ నాయినికే ఇచ్చారు. 2019 దాకా అన్ని పర్వదినాల్లో వరుసగా ఆయనే జాతీయజెండా ఎగురవేశారు. నాయిని కూడా టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు అంతే విధేయత చూపారు. ఏనాడూ పార్టీలైన్, అధినేత ఆలోచనలకు ఏనాడూ విరుద్ధంగా వ్యవహరించలేదు. పార్టీ సంక్షోభం పరిస్థితుల్లోనూ కేసీఆర్ వెంట నిలవడంతోపాటు, ఆయన నాయకత్వాన్ని బలపర్చారు.
తుదిశ్వాసదాకా కార్మికుల కోసమే..
కార్మికనేతగా పేరొందిన నాయిని నర్సింహారెడ్డి తుదిశ్వాస వరకు వారి సంక్షేమం కోసమే పాటుపడ్డారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని వీఎస్టీలో కార్మికసంఘ నాయకుడిగా ఎన్నికైన ఆయన తర్వాత అనేక కంపెనీల్లో కార్మికసంఘాలకు నాయకత్వం వహించారు. జనతాపార్టీకి అనుబంధంగా ఉన్న హిందూ మజ్దూర్ సంఘ్ (హెచ్ఎంఎస్) సంఘ నాయకుడిగా చనిపోయే వరకు కొనసాగా రు. టీఆర్ఎస్లో ఉన్నా, మంత్రిగా పనిచేసి నా ఆ కార్మిక సంఘాన్ని మాత్రం ఏనాడూ వీడలేదు. ముంబయిలో రిక్షా పుల్లర్ యూనియన్‌కు కూడా నాయకత్వం వహించారు. ఎమర్జెన్సీలో రైల్వేచరిత్రలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణ రైల్వే బంద్‌ను చేపట్టడం లో కీలకంగా వ్యహరించారు. దేశంలోనే మొదటిసారిగా కార్మికులకు రవాణా, క్యాంటీన్ ను వీఎస్టీలో ఏర్పాటు చేయించారు.
మూగబోయిన నేరేడుగొమ్ము
దేవరకొండ/చందంపేట: నాయిని మరణవార్త తెలిసి ఆయన సొంత ఊరు నల్లగొం డ జిల్లా నేరేడుగొమ్ము మూగబోయింది. కడ చూపు కోసం పెద్దఎత్తున హైదరాబాద్ తరలివెళ్లారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినా సొంతూరును నాయిని ఎన్నడూ మరువలేదు. జిల్లాల పునర్విభజన సమయంలో నేరేడుగొమ్ము మండలాన్ని ప్రభుత్వం ప్రకటించడంలో నాయిని కృషి చాలా ఉంది.
రాజకీయ ప్రస్థానం
నాయిని మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రెండుసా ర్లు మంత్రిగా పనిచేశారు. ముషీరాబాద్ నుంచి 1978 నుంచి 1999 వరకు జనతా, జనతాదళ్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన.. తర్వాత టీఆర్ఎస్ నుంచి పోటీచేశారు. 1978లో తొలిసారిగా జనతా పార్టీ తరఫున పోటీచేసిన నాయిని.. దిగ్గజాలైన టీ అంజయ్య, సంజీవరెడ్డిపై గెలుపొందారు. 1983లో ఓడిన నాయిని.. 1985లో అక్కడి నుంచే జనతాపార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1989, 1994లో కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో, 1999లో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ చేతిలో ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ నుంచి 2004లో పోటీచేసి గెలిచారు. 2008 ఉపఎన్నిక, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు.
తెలంగాణ ముద్దుబిడ్డ
తెలంగాణ ఉద్యమ, కార్మిక నేత. నల్గొండ ముద్దు బిడ్డ. ఆయన మరణం రాష్ర్టానికి తీరని లోటు. జనతా పార్టీలో కీలక పాత్ర పోషించిన నేత. టీఆర్ఎస్లో చురుగ్గా వ్యవహరించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశారు. తొలి హోంమంత్రిగా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో కీలకంగా పనిచేశారు.
-గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి చైర్మన్
రాష్ర్టానికి తీరని లోటు
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న తెలంగాణ పోరాటయోధుడు. కార్మిక నాయకుడిగా ఉంటూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పాల్పడిన గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
-పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ స్పీకర్
కార్మిక పక్షపాతి
ఉద్యమ నేతగా తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నిలిచిన జన నాయకులు, కార్మిక పక్షపాతిగా మనందరి మనసులో చిరస్థాయిలో నిలిచిపోతారు. నాయిని మరణం అందరిని తీవ్రంగా కలిచివేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
-కే తారకరామారావు, పరిశ్రమలశాఖ మంత్రి
ఇద్దరం ఒకే జైలులో ఉన్నాం: నాయిని నాకు కుటుంబసభ్యుడి లాంటివారు. ఎమర్జెన్సీలో ఇద్దరం ఒకే జైలులో 16 నెలలు ఉన్నాం.
- దత్తాత్రేయ, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్
నాయిని మరణం కలచివేసింది: నాయిని మరణం కలచివేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
- వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం
పులి బిడ్డలా గాండ్రించిన నాయకుడు: హక్కులు అణిచివేతకు గురైనప్పుడు, ప్రజాస్వామ్యానికి అవరోధం కలిగినప్పుడు పులి బిడ్డలా గాండ్రించిన నాయకుడు నాయిని.
- ఈటల రాజేందర్, వైద్యారోగ్యశాఖ మంత్రి
నాయిని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది: నాయిని ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం గొప్పది. ఆయన లోటు పూడ్చలేనిది.
- టీ హరీశ్‌రావు, ఆర్థికమంత్రి
చురుగ్గా సుదీర్ఘంగా పనిచేశారు: ఉద్యమంలో, టీఆర్ఎస్లో చురుగ్గా సుదీర్ఘంగా పనిచేశారు. ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలు మరువలేనిది.
- వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి
పేదల అభ్యున్నతికి పరితపించే నేత: పేదల అభ్యున్నతికి తపించే వ్యక్తి. ఉద్యమంలో నాయినిది కీలక పాత్ర
- తలసాని, పశుసంవర్ధకశాఖ మంత్రి
ప్రజల నాయకుడు నాయిని: ప్రజల నేత. ఆయన మృతి తెలంగాణ సమాజానికి, పార్టీకి, కార్మికలోకానికి తీరని లోటు.
- సత్యవతి రాథోడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
గొప్ప పోరాటయోధుడు: గొప్ప పోరాటయోధుడు. ఆయన మరణం టీఆర్ఎస్కు, తెలంగాణ రాష్ర్టానికి పూడ్చలేని లోటు.
- కొప్పుల ఈశ్వర్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి
కార్మికుల అభ్యున్నతి కృషి చేశారు: కార్మికుల అభ్యున్నతి, సంక్షేమానికి అహర్నిశలు కృషిచేసిన వ్యక్తి. ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతారు.
- ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
అంచెలంచెలుగా ఎదిగారు: అంచెలంచెలుగా కార్మిక నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
- జీ జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి
నిబద్ధత గల నాయకుడు: నిబద్ధత గల నేత. కల్మషంలేని వ్యక్తి.
- ఎర్రబెల్లి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
కార్మిక లోకానికి తీరని లోటు: కార్మిక నేతగా, తెలంగాణ తొలి హోంమంత్రిగా గొప్ప సేవచేశారు. ఆయన మృతి కార్మిక లోకానికి లోటు.
- మహమూద్ అలీ, హోంమంత్రి
ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు: కార్మికమంత్రిగా పదవి చేపట్టిన నాకు ఆయన ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చా రు. ఆయన కార్మికుల పక్షపాతి.
- మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి
నాయిని ఆత్మకు శాంతి చేకూరాలి: రాష్ట్ర సాధనలో నాయిని కీలకపాత్ర పోషించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
- పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి
ఆయనతో అనుబంధం మరువలేనిది: నాయిని మరణం టీఆర్ఎస్కు, తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఆయనతో ఉన్న అనుబంధం మరువలేనిది.
- సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
హక్కుల కోసం పోరాడిన వ్యక్తి: కార్మిక నాయకుడిగా ఉంటూ వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఆయన. నాయిని మరణం రాష్ర్టానికి తీరని లోటు.
- వీ శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ మంత్రి
ఉద్యమంలో నాయిని పాత్ర మరువలేనిది: నాయిని మరణం టీఆర్ఎస్కు తీరని లోటు. ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది.
- సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట: సీఎం కేసీఆర్ నర్సన్న అని ఆప్యాయంగా పిలిచేవారు. ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నడిచారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
- సంతోష్‌కుమార్, రాజ్యసభసభ్యుడు
కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి: ఉద్యమం నుంచి నేటివరకు రాష్ట్రం కోసం, కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడిన వ్యక్తి నర్సన్న.
- కల్వకుంట్ల కవిత , ఎమ్మెల్సీ
రెండు దశాబ్దాల అనుబంధం: ఉద్యమంలో కేసీఆర్‌కు అండ గా నిలిచారు. కార్మిక ఉద్యమాల్లో ఉద్ధండుడు. ఆయనతో నాకు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్నది.
- బీ వినోద్‌కుమార్ , రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు
కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవారు: ప్రజాసమస్యలపై, కార్మికుల హక్కులపై అలుపెరుగని పోరాటంచేశారు. ఉన్నది ఉన్నట్టు, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవారు.
- కెప్టెన్ లక్ష్మీకాంతారావు, రాజ్యసభ సభ్యుడు
హోంమంత్రిగా చిరస్మరణీయ సేవలు: మరణం బాధ కలిగించింది. హోంమంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయం.
- నామా నాగేశ్వర్రావు, లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత
డీజీపీ, కోలేటి దిగ్భ్రాంతి: నాయిని మృతిపై డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సైతం తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.