గురువారం 09 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 01:20:13

సాహితీ పిపాసి పాములపర్తి

సాహితీ పిపాసి పాములపర్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అద్భుతమైన కవి, రచయిత, సాహిత్య పిపాసి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. మంథని శాసనసభ్యునిగా ప్రస్థానం మొదలుపెట్టి.. మంత్రిగా, కేంద్రమంత్రిగా, సీఎంగా, ఏఐసీసీ అధ్యక్షునిగా, ప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగినా.. తన సాహిత్య పిపాసను వదులుకోలేదని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సాహిత్యానికి సమయం కేటాయించడం కష్టమని, కానీ ఆయన తన చదువరి లక్షణాలను వదులుకోలేదన్నారు. ఓ సాయుధపోరాట యోధున్ని గొల్ల రామవ్వ ఎలా కాపాడిందో అద్భుతంగా చెప్పారని తెలిపారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

పీవీ మాట్లాడితే.. సరస్వతి నాట్యం చేసినట్లే 

పీవీ అంతర్ముఖుడిగా ఉంటారు. కానీ అయన అంతర్ముఖుడు కాదు.. అలా అయితే 17 భాషలు ఎలా నేర్చుకుంటారు? ఆయన ఎక్కువగా మాట్లాడరు. కానీ ఆయన మాట్లాడితే మాత్రం సరస్వతీదేవి నాట్యం చేసినట్లే ఉంటుంది. వందేమాతరం ఉద్యమంలో పా ల్గొన్నారని నాటి నిజాం.. పీవీని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. తన రాజ్యంలో ఎక్కడా సీటు ఇవ్వొద్దని ఆదేశించారు. అయినా మొక్కవోని దీక్షతో మహారాష్ట్రకు పోయి చదువుకున్నారు. మరాఠీ కూడా నేర్చుకున్నారు. మరాఠీ నవలలను తర్జుమా చేసేంత, మరాఠీలో అనర్గళంగా ప్రసంగించేంత శక్తి సంపాదించారు. 

విశ్వనాథ సత్యనారాయణే ఆశ్చర్యపోయారట

‘పీవీలో రసజ్ఞత కూడా ఉంది. సాహిత్యం చదువుకున్నా ఆయన గొప్పలు చెప్పుకోలేదు. ఆయన గురించి పొగిడితే ‘చాల్లేవయ్యా.. నా గురించి ఏం పొగుడుతావు’ అనేవారు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయిపడగలు’ చాలా గొప్ప నవల. చాలామంది పీవీగారు దీన్ని హిందీలోకి అనువాదం చేశారని చెప్తారు. కానీ ఆయన అనువాదం చేయలేదు.. అనుసృజన చేశారు. ఎవరో విశ్వనాథ సత్యనారాయణను అడిగారంటా.. ‘పీవీ మీ నవలను హిందీలోకి అనువాదం చేశారు కదా.. మీకు ఎలా అనిపించింది? అని. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ.. ‘అసలు పీవీ హిందీలో రాస్తే నేను తెలుగులోకి అనువాదం చేసినట్లు అనిపించింది’ అని అన్నారట. రసజ్ఞత ఉంది కాబట్టే వేయిపడగలు నవలను చదివి.. తాను పొందిన రసప్రాప్తిని దేశానికి తెలియజేయాలనే తపనతో దాన్ని హిందీలోకి అనువదించారు. ఆ నవలను నేను 40ఏండ్ల కిందట చదువుకున్నా.. ఇప్పుడు కరోనా నేపథ్యంలో మళ్లీ చదివిన.. ఇది చాలా కఠినంగా ఉంటది. కొంత సాహిత్యం గురించి తెలిసిన వాళ్లకే భాష అర్థంకాదు. తెలుగులోనే అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటది. అలాంటిది పీవీ దాన్ని హిందీలోకి తర్జుమా చేసేందుకు ఎంత కష్టపడ్డారో అనిపించింది. ఇదొక బిగ్‌ టాస్క్‌.  అని పేర్కొన్న కేసీఆర్‌ భాస్కరశతకంలోని ఓ ప ద్యాన్ని చదివి వినిపించారు. 

‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటన్‌ బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నింపొదవెడునుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’

 అంటూ ముగించగానే ప్రభుత్వ సలహాదారు రమణాచారి చప్పట్లు కొట్టారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘రమణాచారి చప్పట్లు కొట్టిం డ్రా.. రమణన్న కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహించడమే కాదు గొప్ప సాహితీవేత్త కూడా. ఈ పద్యం మీద ఆయన ఓ పుస్తకమే రాసిండ్రు. ఆందుకే ఆయన నుంచి చప్పట్లు ఆశించిన. రసజ్ఞత ఉన్నవాళ్లే స్పందిస్తారు. లేనివాళ్లు స్పందించరు’ అని వ్యాఖ్యానించారు.


logo