సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 01:46:33

జనమే బలం.. బలహీనత

జనమే బలం.. బలహీనత

  • సరిగ్గా వినియోగించుకుంటే వేగంగా ఆర్థికవృద్ధి 
  • నాడే ఆ దిశగా మాజీ ప్రధాని పీవీ బాటలు జనాభా పెరిగితే ఆహార, నిరుద్యోగ సమస్యలు 
  • ఇష్టమొచ్చినట్టు నియంత్రిస్తే పెను ప్రమాదం భవిష్యత్తులో మానవ వనరుల కొరత 
  • నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

‘భూమి మీదకు వచ్చే ప్రతిబిడ్డ ఒక మానవ వనరు. ఉత్పాదక శక్తి. ఆ దేశ ఆర్థిక వృద్ధికి బలం’ అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతుంటారు. కానీ, జనాభా పెరుగుదల నియంత్రణ కోల్పోతే పెనుప్రమాదం వాటిల్లుతుంది. ఉద్యోగావకాశాలు, ఆహార భద్రత లేకుండాపోతుంది. సహజవనరుల వినియోగం పెరిగి, పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. ఫలితంగా యావత్తు మానవాళి వినాశానికే కారణమవుతుంది. ప్రణాళిక లేకుండా జనాభా నియంత్రణను చేపట్టినా భవిష్యత్తులో అనర్థాలే. అందుకే నిర్దిష్ట కార్యాచరణతో జనాభా పెరుగుదలను నియంత్రిస్తూ ఉండాలి. నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక దేశ ఆర్థిక ప్రణాళికలు, అభివృద్ధి సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరం. దానికోసం ప్రతిదేశం తనకంటూ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది. జనాభా పెరుగుదల, తరుగుదల వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలపై ప్రజలకు అవగాహన తప్పనిసరి. అందుకే ఐక్యరాజ్యసమితి 1989 నుంచి ప్రతి ఏటా జూలై11న ప్రపంచజనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 1987 జూలై 11వ తేదీన పుట్టిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్నది. అందువల్లే ఆ రోజున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈ రోజున ఏటా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.

అయినా, ప్రపంచవ్యాప్తంగా ఏటా జనాభారేటు విపరీతంగా పెరిగిపోతున్నది. అందుకు వైద్యసౌకర్యాలు, ఆయుప్రమాణాలు పెరగడం, మరణాల రేటు తగ్గడం ప్రధాన కారణాలైతే, కుటుంబ నియంత్రణ పాటించకపోడం, చాలా మందికి అవగాహన లేకపోవడం మరో కారణం. దీంతో జనాభా విస్పోటనం అవిచ్ఛన్నంగా కొనసాగుతున్నది. ఫలితంగా నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. ఆహారభద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రకృతి వనరుల వినయోగం విపరీతంగా పెరిగి పర్యావరణం దెబ్బతింటున్నది. అందుకే ప్రతి దేశం ఈ అంశంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నది. జనాభా నియంత్రణ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాయి.

పక్కా కార్యాచరణతోనే నియంత్రణ

జనాభా పెరుగుదలను ఇష్టారీతిన నియంత్రించినా పెనుముప్పు తప్పదని పలు దేశాల అనుభవాలు వెల్లడిస్తున్నాయి. జనాభాను మూడు వర్గాలుగా విభజిస్తే అందులో 0-15 ఏండ్ల బాలలు, 60 ఏండ్ల పైబడిన వృద్ధులు సామర్థ్యం లేనివారే. ఏ దేశంలోనైనా పనిచేసేవారి వయోవర్గ జనాభా వయస్కులు 15 నుంచి 59 ఏండ్లవాళ్లే. వీరిని మానవ వనరులుగా తీర్చిదిద్దుకున్న దేశాలు అనతికాలంలోనే ఆర్థిక వృద్ధిని సాధించాయి. అందుకు సింగపూర్‌, జపాన్‌ దేశాలే ఉదాహరణ. జనాభా నియంత్రణలో ఆ మూడు వర్గాల్లో సమతుల్యం దెబ్బతింటే ప్రమాదమే. చైనా 1979లో ఒకే బిడ్డ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఫలితంగా ప్రస్తుతం ఆ దేశం మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నది. ఆ దేశమే కాక అమెరికా, జపాన్‌, జర్మనీ తదితర దేశాలు మానవ వనరుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి.

ఐదేండ్లలో చైనాను మించనున్న భారత్‌


2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121.00 కోట్లు. యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ ఏజెన్సీ (యూఎన్‌పీఎఫ్‌ఏ) ప్రకారం ప్రపంచ జనాభాలో అది 17 శాతం. ఏటా 0.9 వార్షిక వృద్ధిరేటుతో 2026 నాటికి భారత్‌ జనాభా 140 కోట్లకు చేరుకొని చైనాను అధిగమిస్తుందని యూఎన్‌పీఎఫ్‌ఏ అంచనా వేసింది. దేశంలో బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ర్టాల్లో జనాభా వృద్ధి అధికంగా నమోదవుతుండగా, మిగతా రాష్ర్టాల్లో నామామాత్రంగా ఉందని వెల్లడించింది. కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంతాన సాఫల్యత తగ్గుముఖం పడుతున్నదని హెచ్చరించింది.

ఆనాడే పీవీ మార్గదర్శకాలు

దేశంలో జనాభా వృద్ధిని నియంత్రించి, వారిని ఉత్పాదక వనరులుగా మలుచుకుని ఆర్థిక వృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తేనే అగ్రస్థానంలో నిలుస్తామని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అనేవారు. ప్రధాని ఇందిరాగాంధీకి సలహాదారుడిగా 1976లోనే జాతీయ జనాభా విధానాన్ని రూపొందించి, కుటుంబ నియంత్రణకు ఎంతో కృషి చేశారు. 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కరుణాకరన్‌ అధ్యక్షతన కమిటీ వేశారు. కుటుంబ నియంత్రణ పాటించిన కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందించి, జనాభాలోని అధికశాతం మందిని మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు బాటలు వేశారు. వృత్తివిద్యా కళాశాలల ఏర్పాటును ప్రోత్సహించారు.


logo