ఆదివారం 24 జనవరి 2021
Telangana - Aug 05, 2020 , 03:35:20

మూగబోయిన గిరిజన గొంతుక

మూగబోయిన గిరిజన గొంతుక

  • సున్నం రాజయ్య కన్నుమూత 
  • కరోనాతో మృత్యువాతపడిన సీపీఎం మాజీ ఎమ్మెల్యే
  • స్వగ్రామం సున్నంవారిగూడెంలో ముగిసిన అంత్యక్రియలు
  • సీఎం కేసీఆర్‌, స్పీకర్‌, మండలి చైర్మన్‌ సంతాపం
  • రాష్ట్ర మంత్రులు, సీపీఎం, సీపీఐ నేతల నివాళి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గిరిజన నాయకుడు ప్రజాస్వామ్యం, రాజకీయాల పట్ల జనసామాన్యంలో విశ్వాసం కలిగించిన ఆదర్శనేత, నిరాడంబరుడు, పేదల సమస్యలపై నిరంతరం పోరాడిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు ఆయన కుటుంబసభ్యులు సోమవారం కరోనా పరీక్ష చేయించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడలో ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్సపొందుతూ అర్ధరాత్రివేళ కన్నుమూశారు. ఆయన స్వగ్రామం సున్నంవారిగూడెంలో మంగళవారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి. ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడికి కూడా కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వారు ప్రస్తుతం రాజమహేంద్రవరం దగ్గర బొమ్మూరులో చికిత్స పొందుతున్నారు.

మూడుసార్లు ఎమ్మెల్యే

సున్నం రాజయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరంలో కలిశాయి. దీంతో రాజయ్య 2019లో రంపచోడవరం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో నివసిస్తున్నారు. 

అసెంబ్లీకి ఆటోలో

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సున్నం రాజయ్య నిరాడంబరమైన జీవితం గడిపారు. అసెంబ్లీకి ఆటోలో, బస్సులో వెళ్లేవారు. హైదరాబాద్‌లోని వీధి క్యాంటీన్లలో టిఫిన్‌, భోజనం చేసేవారు. ఓ సందర్భంలో నియోజకవర్గ సమస్యలపై  సచివాలయానికి ఆటోలో వెళ్లిన రాజయ్య వెంట గన్‌మెన్‌ లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఐడీ కార్డు చూపడంతో సచివాలయంలోకి అనుమతిచ్చారు. పోలవరం నిర్వాసితుల పక్షాన రాజయ్య పోరాటం చేశారు. 

సీఎం కేసీఆర్‌, మంత్రుల సంతాపం

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం తెలిపారు. నిరాడంబర రాజకీయ నేతగా ప్రజల హృదయాల్లో రాజయ్య నిలిచిపోతారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం కృషి చేశారంటూ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు.. రాజయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జీవితమంతా వారి శ్రేయస్సు కోసం పనిచేశారని కేటీఆర్‌ కొనియాడారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. తాను ఎంతగానో గౌరవించే రాజయ్య మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించిందని ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘పేద ప్రజలు, ఆదివాసీలు, గిరిజనులు, దళితుల గొంతుకగా జీవితాంతం వారి సమస్యల పరిష్కారం కోసమే బతికిన అసామన్యుడు’ అంటూ రాజయ్య మృతి పట్ల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సంతాపం తెలిపారు. గిరిజనుల సమస్యలపై రాజీలేని పోరు సాగించారని తెలిపారు.

 ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, రాజకీయాల పట్ల జనసామాన్యంలో విశ్వాసం కలిగించిన ఆదర్శనాయకుడని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, వేములప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతిరాథోడ్‌ తదితరులు కొనియాడారు. రాజయ్య మరణం పార్టీకి, ప్రజాఉద్యమాలకు తీరని లోటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. సున్నం రాజయ్య నిబద్ధత కలిగిన వామపక్షవాది అని సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి,  సీనియర్‌ నేతలు కే నారాయణ, చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాజయ్య ఆకస్మిక మృతి దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.


logo