ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 20, 2021 , 00:02:26

..అయినా మనిషి మారలేదు

..అయినా మనిషి మారలేదు

విద్య అనేది కనీస మానవ హక్కు. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో దీనికి ప్రాముఖ్యమిచ్చారు. ఈ మానవ హక్కు అర్థవంతం కావాలంటే అది అందరికీ చేరేలా సమానావకాశాలు లభించాలి. భారతదేశంలో అభివృద్ధి క్రమానికి సార్వత్రిక విద్య, వయోజన నిరక్షరాస్యత నిర్మూలనను అనుసరిస్తున్నాం. అందరికీ విద్య అందుబాటులోకి వచ్చేందుకు అవసరమైన అన్ని అవకాశాలు కల్పించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. విద్యపై 1986లో రూపొందించిన జాతీయ విద్యావిధానం దీనిని ప్రతిఫలించింది. 

- పీవీ నరసింహారావు

  • ‘నమస్తే తెలంగాణ’తో సీనియర్‌ రాజకీయవేత్త, మాజీ మంత్రి  తక్కళ్లపల్లి పురుషోత్తమరావు

‘తనకు ఇది కావాలని ఏ సందర్భంలోనూ అడగకుండానే తన ప్రతిభాపాటవాలతో పైకెదిగి ప్రధాని అయిన ఏకైక వ్యక్తి పీవీ నరసింహారావు. నెహ్రూ తర్వాత దేశానికి సేవలు అందించిన పండిత ప్రధాని పీవీనే. పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా, రాగద్వేషాలకు తావివ్వకుండా జీవిత పర్యంతం మానవీయ విలువలకు కట్టుబడిన, రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలివ్వని నిస్వార్థ నాయకుడు’ అని సీనియర్‌ రాజకీయవేత్త, మాజీ మంత్రి తక్కళ్లపల్లి పురుషోత్తమరావు పేర్కొన్నారు. సంయమనం, సమభావం ఆయన ఆదర్శ స్వభావాలని అభిప్రాయపడ్డారు. పీవీని దగ్గరి నుంచి చూసిన సన్నిహితుడాయన. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆనాటి అనుభవాలను, జ్ఞాపకాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. 


హైస్కూల్‌ నుంచి ప్రధాని దాకా..

మాది కొంకపాక గ్రామం. నా విద్యాభ్యాసం పీవీ చదివిన వరంగల్‌ మర్కజీ స్కూల్‌లోనే సాగింది. అలా నా హైస్కూల్‌ రోజుల నుంచి అంటే 12, 13 ఏట నుంచే పీవీ నరసింహారావు గొప్పతనం గురించి వింటూ పెరిగాను. ఆయనంటే మదిలో ఒక గౌరవం ఏర్పడింది. వరంగల్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ రాజకీయ నేత, మాజీ మంత్రి టీ హయగ్రీవాచారి ఆయన అత్యంత ఆప్తమిత్రులు. మరోవైపు హయగ్రీవాచారితో మా కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది. నేను 1958లో ఆయన ప్రోద్బలం వల్లే రాజకీయాల్లోకి ప్రవేశించాను. తరచూ వారింటికి వెళ్లేవాడిని. ఆ క్రమంలో ఒకసారి హయగ్రీవాచారి నన్ను పీవీకి పరిచయం చేశారు. అటు తరువాత నేను 1967లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మొదటిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. దాంతో అసెంబ్లీలో అనేక సందర్భాలలో పీవీని కలిసే అవకాశం లభించింది. అలా సాన్నిహిత్యం పెరిగింది. ప్రధాని అయ్యాక కూడా పీవీని కలిశాను. ఎక్కడ కలిసినా పేరు పెట్టి ఆప్యాయంగా పలుకరించేవారు.

తర తమ భేదాలకు దూరం

పీవీ నరసింహారావుతో ఎన్నో మధురస్మృతులు ఉన్నాయి. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పటికీ పీవీని తలచుకోగానే కొన్ని మాటలు గుర్తుకు వస్తాయి. నేను మొదటగా సంగెం సర్పంచ్‌గా ఎన్నికయ్యా. అటు తరువాత 24 ఏండ్ల వయస్సులోనే 1962లో వర్ధన్నపేట పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడంతో పాటు జిల్లా పరిషత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశా. సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అనంతరం పీవీని కలిసిన సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ‘నువ్‌ సర్పంచ్‌గా ఉన్నప్పుడు నీ గ్రామానికి సంబంధించినంత వరకు మాత్రమే నీకు బాధ్యత ఉంటుంది. ఇప్పుడు సమితి ప్రెసిడెంట్‌ అయ్యావు. అన్ని గ్రామాలను నీ గ్రామాలుగానే భావించాలి. ఎప్పుడూ పక్షపాత భావాన్ని చూపకూడదు. ఆ భావం ప్రజల్లో వచ్చేలా ప్రవర్తించకూడదు’ అని సమభావం గురించి పీవీ ఉద్బోధించారు. నాకు చెప్పిన మాటలను ఆయన తు.చ. తప్పకుండా పాటించారు. ఆయన తర తమ భేదాలకు దూరం. దేశానికి ప్రధానిగా, కేంద్ర మంత్రులుగా చేసిన ఎంతో మంది తమ ప్రాంతాలకు ప్రత్యేక ప్రయోజనాలు చేకూర్చారు. పీవీ అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన ప్రాంతం అని ప్రత్యేకత కనబరచకుండా అన్ని ప్రాంతాలనూ ఒకే రీతిన చూశారు. అది ఆయన విశాల హృదయానికి తార్కాణం. 

రాజీ లేకుండా రాజనీతిజ్ఞత


బాధ్యతలను నిర్వర్తించిన ప్రతి మంత్రిత్వశాఖలోనే కాక, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కూడా అనేక రాజకీయ, పాలనాపరమైన, ఆర్థికపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనులు పీవీ. అందులో అన్నింటికంటే ముఖ్యంగా ఏపీలో ప్రవేశపెట్టిన భూసంస్కరణలు ఎంతో ముఖ్యమైనవి. అవి ఆయన నిస్వార్థ ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనం. ఆ చట్టాన్ని రూపొందించే విషయమే కాదు, దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టే సందర్భం వరకూ పకడ్బందీగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడమేకాక, రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. భూస్వామ్య వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా ఎక్కడా రాజీపడలేదు. ఇక ఆ భూసంస్కరణల చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా పీవీ చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోతుంది. పీవీ చొరవ వల్లే ఆనాడు 29 లక్షల ఎకరాలు పేదలకు దక్కాయి. దేశంలో భూసంస్కరణలను నిక్కచ్చిగా, నిజాయితీతో, పూర్తి చిత్తశుద్ధితో అమలుచేసిన ఏకైక ముఖ్యమంత్రి పీవీనే అని ఇందిరాగాంధీ కూడా ప్రశంసించారంటేనే అర్థం చేసుకోవచ్చు. 

దూరదృష్టి.. దార్శనికత

పీవీ రాజకీయ ఆలోచనలకు సంబంధించి ఒక సంఘటనను ఉదహరిస్తాను. ప్రధానిగా ఎన్నికయిన తరువాత ఒకసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై సంభాషించారు. ఆనాటి దేశ, ప్రపంచ పరిస్థితులను వివరించిన తీరు ఆశ్చర్యం గొలిపింది. ‘పూర్వం రోజుల్లో సమాజంలో 400 - 500 ఏండ్లు గడిస్తే తప్ప ఎలాంటి మార్పులు వస్తుండేవి కావు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఒకే తరంలో, స్వల్ప వ్యవధిలోనే వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచమే ఒక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ వేగంలో అన్నింటికంటే ముఖ్యంగా మానసిక సంక్షోభం అతి ప్రధానమైనది. వాటిన్నింటినీ అవగాహన చేసుకోవడమేకాదు, నిగ్రహంగా నిలబడాలి. వేగవంతమైన నిర్ణయాలను తీసుకోవాలి’ అంటూ ఉద్బోధించారు. అటు తరువాత దేశపరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్న దార్శనికుడు ఆయన. పీవీ ఆలోచనలకు ఒక మచ్చుతునక ఈ ఉదంతం. పీవీ ఎంత సౌమ్యంగా ఉండేవారో, అవసరమైన సందర్భాల్లో అంతే దృఢంగా, ధైర్యంగా వ్యవహరించేవారు.

నిదానమే ప్రధానంగా..

పీవీ జ్ఞాపకశక్తి అమోఘం. మంత్రిగానైనా, ముఖ్యమంత్రిగానైనా శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల ఉన్నతాధికారుల సహకారం లేకుండానే ఠక్కున సమాధానం చెప్పేవారు. అదీగాక సభ్యుడు ఏ భాషలో ప్రశ్నను సంధిస్తే తిరిగి అదే భాషలో సమాధానం చెప్పి కూర్చుండబెట్టేవారు. ప్రతిపక్ష నేతలు ఎంత ఆవేశంగా ప్రసంగించినా, పీవీ మాత్రం నిదానంగానే వారికి జవాబు ఇచ్చేవారు. సంయమనం ఆయన స్వభావం. ఏ సమస్యపైనైనా దాని మూలాల్లోకి వెళ్లి దానిపై అవగాహన కల్పించేవారు. ఎక్కడా ఆవేశపడేవారే కాదు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సత్సంబంధాలను కొనసాగించేవారు. తొందరపడకుండా నిండుగా, హుందాగా ఉండేవారు. ఆయన ప్రసంగంలోనే కాదు, సంభాషణలోనూ ఒక అపశబ్దం కూడా తొణక్కపోయేది. విధానపర నిర్ణయాలపై తప్ప ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు దిగేవారు కాదు. 

సామాన్యుడు.. సుమధుర భాషి..

పీవీ నిరాడంబర జీవి. హంగూ ఆర్భాటాలు ఉండేవి కావు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటా. ఒకసారి వరంగల్‌ మీదుగా స్వగ్రామం వంగరకు వెళ్తున్నారు. ఆ సందర్భంగా నన్ను కూడా కారులో వెంట తీసుకెళ్లారు. వంగరలోని వారి ఇంటిని చూసి నేను ఆశ్చర్యపోయా. ఆ చతుశ్శాల భవంతిలో ఎలాంటి ఆడంబరాలు లేవు. ఆధునిక హంగులు, అధికార దర్పాన్ని ప్రతిబింబించే ఫర్నిచర్‌ ఎక్కడా కానరాలేదు. సామాన్యుల ఇండ్లలో ఉండే మడత కుర్చీలు పీటలు తప్ప వేరే ఏమీ లేవు. పీవీ వేషధారణ కూడా అదేవిధంగా ఉండేది. సంభాషణ మృదువుగా, ఆప్యాయత నిండుకుని ఉంటుంది. ప్రధానిగా ఎలా వ్యవహరించాలో అలానే ప్రవర్తించేవారు. సామాన్యులతో ఎలా సంభాషించాలో అలానే వారి భాషలోనే సంభాషించేవారు. మరొక విషయం ఏమిటంటే పీవీ ఏ హోదాలో ఉన్నా తన మిత్రులను కానీ, ఊరివాళ్లను కానీ, స్నేహితులను కానీ ఆప్యాయతతో, అంతకుముందులాగానే ఒరేయ్‌.. తురేయ్‌ అంటూ చక్కటి తెలంగాణ యాసలోనే పలుకరించేవారు. అధికార దర్పాన్ని ప్రదర్శించేవారు కాదు. 

- ఇంటర్వ్యూ 

మ్యాకం రవికుమార్‌

అందుకే వైఎస్‌కు పదవి ఇవ్వలె..

రాజకీయాల్లో ఈర్ష్యాసూయలు సహజం. అది కాంగ్రెస్‌లో కొంత ఎక్కువ మోతాదులో కనిపిస్తుంటుంది. ఒక్కోసారి మహానేతలకు సైతం పెను సంకటంగా మారుతుంది. వర్గ రాజకీయ ఆధిపత్యాల్లో అలా ఒకసారి పీవీ కూడా చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేమిటంటే.. రాయలసీమకు సంబంధించి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇద్దరూ బలమైన నాయకులే. వారిరువురూ వారివారి సొంత జిల్లాలైన కడప, కర్నూలులో చక్రం తిప్పుతుండేవారు. ఇరువురి మధ్య వర్గపోరు కొనసాగుతుండేది. ఆ నేపథ్యంలో విజయ్‌భాస్కర్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పుడు మంత్రివర్గంలో వైఎస్‌కు చోటివ్వలేదు. దీంతో ఆయన వర్గంలో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది. విజయభాస్కర్‌రెడ్డిపై కోపంతో కొందరు వైఎస్‌ వర్గీయులు పీవీ సభలో నానా రాద్ధాంతం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, పీవీ నరసింహారావు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల నియోజకవర్గ పర్యటనకు తొలిసారిగా విచ్చేసిన సందర్భంలో అది చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. అందుకు ఆయన సిద్ధమయ్యారు. ముందుగా రాష్ట్రంలో రాజకీయ వర్గపోరు, సంబంధిత విషయాలను వివరించేందుకు ఆయన పలువురు మంత్రులను ప్రధాని పీవీ వద్దకు పంపారు. విషయాలన్నీ తెలుసుకున్న పీవీ.. ‘రాజకీయాల్లో మంచిచెడులు అన్నీ తెలుసు. ఇవన్నీ సహజమే. వారి ప్రవర్తన ఇలా ఉంటుంది కాబట్టే వైఎస్‌కు పదవి ఇవ్వలె. అలాంటివారిని మనం ప్రోత్సహించకూడదు. విజయ్‌భాస్కర్‌రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరమేమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. 

వీరబ్రహ్మేంద్ర.. నరసింహుడు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్‌లో జరగబోయే అనేక పరిణామాల గురించి వందల సంవత్సరాల క్రితమే తన కాలజ్ఞానంలో వివరించారు. అందులో ఒక ఆసక్తికర అంశం.. రాబోయే కాలంలో ఢిల్లీ పరిపాలకులలో మరో నరసింహుడు ఉంటాడని వివరించారు. దీనిని ఒక సందర్భంలో కడప జిల్లాకు చెందిన వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడొకరు పద్మశ్రీ

 తుర్లపాటి కుటుంబరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఉత్సుకతతో చరిత్ర గురించి ఆరా తీశారు. గడిచిన నాలుగవందల ఏండ్లలో ఢిల్లీని కేంద్రంగా పరిపాలించిన రాజుల పేర్లనన్నింటినీ వడబోశారు. ఎక్కడా నరసింహ నామధేయమున్న రాజుకానీ, పరిపాలకుడు కానీ ఆయనకు తారసపడలేదు. అదే సమయంలో పీవీ ఢిల్లీలో ప్రధానిగా దేశాన్ని ఏలుతున్నారు. దీంతో కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన నరసింహనామధేయుడు పీవీనే అని కుటుంబరావు సూత్రీకరించారు. దానిమీద ఒక థీసిస్‌ను రాసి, బ్రహ్మంగారి ఆశ్రమానికి సమర్పించగా వారు దానిని పుస్తకరూపంలో తీసుకొచ్చారు. 


VIDEOS

logo