శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:13:21

మాజీ మంత్రి రామస్వామి కన్నుమూత

మాజీ మంత్రి రామస్వామి కన్నుమూత

  • చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి 
  • తెలంగాణ వచ్చే వరకు గడ్డం తీయనని శపథం 
  • మహరాజ్‌గంజ్‌ నుంచి ప్రాతినిధ్యం
  •  సీఎం కేసీఆర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ సంతాపం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ఆబిడ్స్‌: మాజీ మంత్రి, మహారాజ్‌గంజ్‌ మాజీ ఎమ్మెల్యే పీ రామస్వామి(87) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన హైదరాబాద్‌ నగరంలోని మహరాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా సేవలందించారు. ఆయనకు భార్య, ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన డయాలిసిస్‌కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో వైద్యశాలలో చేరారు. డయాలసిస్‌ చేస్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 

రామస్వామి 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో గౌలిగూడ చౌరస్తాలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఉద్యమకారులు మృతి చెందారు. దీంతో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు గడ్డం తీయబోనని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి ఆయన గడ్డం రామస్వామిగా గుర్తింపు పొందారు. 1960లో క్రీయాశీల రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1964లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1983లో మహరాజ్‌గంజ్‌ నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి సీఎం నాదెండ్ల భాస్కరరావు ప్రభుత్వంలో నెల రోజుల పాటు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం బీజేపీలో చేరారు. 

1994లో బీజేపీ తరఫున అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గన్‌మెన్‌లు లేకుండా స్వయంగా బుల్లెట్‌ నడుపుతూ బస్తీలు, కాలనీలలో తిరగడంతోపాటు అసెంబ్లీకి సైతం వెళ్లేవారు. దీంతో బుల్లెట్‌ రామస్వామిగా కూడా పేరుగాంచారు. అనారోగ్యం బారినపడిన రామస్వామిని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ఫోన్‌లో పలకరించారు. రామస్వామి మృతి పట్ల హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు. ఆయన తనకు విద్యార్థి దశ నుంచి మిత్రుడని, ఇద్దరం గౌలిగూడ ప్రాంత వాసులమని గుర్తుచేశారు. 

సీఎం కేసీఆర్‌ సంతాపం 

మాజీ మంత్రి పీ రామస్వామి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతా పం తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మంత్రిగా ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.     

తాజావార్తలు


logo