శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:47

తొలితరం నేత నూకల

తొలితరం నేత నూకల

  • నేడు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి వర్ధంతి 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వరంగల్‌ ఉమ్మడి జిల్లా (ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లా) మహబూబాబాద్‌ ఎడ్జర్లకు చెందిన నూకల రామచంద్రారెడ్డి వర్ధంతి సోమవారం జరుగనున్నది. జలగం వెంగళరావు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన 1974 జూలై 27న మరణించారు. స్వాతంత్య్ర పోరాటంలోనే కాకుండా హైదరాబాద్‌ స్టేట్‌ విముక్తి పోరాటంలో విద్యార్థి దశలోనే ఉద్యమించారు. తన సొంత భూములను విద్యాసంస్థలకు దానం చేశారు. మహబూబాబాద్‌ డిగ్రీ కాలేజీకి ఆ కాలంలోనే 50 ఎకరాల భూమిని అందజేశారు. ఎడ్జర్లలో ప్రభుత్వ పాఠశాల స్థాపనకు సొంత భూమి ఇచ్చారు. ప్రస్తుతం వరంగల్‌ లో కాంగ్రెస్‌ (నూకల రామచంద్రారెడ్డి ట్రస్ట్‌భవన్‌) కార్యాలయానికి ఆయన రెవెన్యూ మంత్రిగా వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించారు. దీంతో నూకల పేరుతోనే ఆ కార్యాలయం ఏర్పడింది. విలువలు గల రాజకీయ నాయకుడిగా, నిజాయితీగల ప్రజాప్రతినిధిగా ఆదర్శ జీవితాన్ని గడిపిన అతికొద్ది మందిలో ముందు వరుసలో నిలిచే నాయకుడిగా నూకల ఆ కాలంలోనే పేరుతెచ్చుకున్నారు. 

పీవీకి మంత్రి పదవి దక్కేలా నూకల కృషి..

విద్యార్థి దశ నుంచి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, నూకల రామచంద్రారెడ్డి ఇద్దరూ స్నేహితులు. ఒకరంటే ఒకరికి ఎనలేని అభిమానం. అయితే పీవీ కన్నా ముందే నూకల మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాగా వరంగల్‌ జిల్లా నుంచి నూకల రామచంద్రారెడ్డిని నీలం సంజీవరెడ్డి ఎంచుకున్నారు. ఇదే జిల్లా నుంచి మర్రి చెన్నారెడ్డి టీ హయగ్రీవాచారిని ప్రతిపాదించారు. అప్పుడు నూకల రామచంద్రారెడ్డి.. పీవీకి పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఒకవేళ పీవీ నర్సింహారావుకు ఇవ్వటం సాధ్యం కాదని భావిస్తే తనకు కూడా మంత్రి పదవి అక్కరలేదని కరాఖండిగా చెప్పి.. పీవీని (1962లో) మంత్రివర్గంలోకి తీసుకునేలా నీలం సంజీవరెడ్డిపై ఒత్తిడి చేసి విజయం సాధించారు. logo