ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ వీలున్నప్పుడల్లా తన వంతు సేవా కార్యక్రమాలు అందిస్తూ అందరి మనసులు గెలుచుకుంటుంది. గత ఏడాది కరోనా విజృంభిస్తున్న సమయంలో తన వంతు సాయం చేసుకుంటూ వెళ్లిన నిధి అగర్వాల్ తాజాగా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది.
ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎవరైన సాయం కావాలనుకుంటే రిక్వెస్ట్‌లు పెట్టొచ్చు. అవసరమైన వారికి చేతనైనంత సాయం అందిస్తాను. నిత్యావసరాలు, మందులు.. ఇలా ఏవైనా సరే సాయానికి నేను సిద్ధం అని చెప్పింది నిధి. ఆర్గనైజేషన్ కోసం తనతో పాటు తన టీం కూడా పని చేస్తుందని పేర్కొంది. త్వరలోనే అభ్యర్థనలను పరిశీలిస్తాం. ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తాము.. అని అన్నారు నిధి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు-తమిళం-హిందీలో కథానాయికగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.