శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 11, 2020 , 01:33:26

మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత

మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత

  • దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస 
  • సీఎం కేసీఆర్‌ సంతాపం
  • స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ ధర్మపురి: మరో దిగ్గజం నేలకొరిగింది. ప్రజాసేవకే అంకితమైన నేత ఇక లేరని తెలిసి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విషాదం అలుముకున్నది. రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రత్నాకర్‌రా వు మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. జువ్వాడి ఆ త్మకు శాంతి కలుగాలని ప్రార్థించారు. జువ్వా డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. 

సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు.. 

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తి మ్మాపూర్‌లో 1928 అక్టోబర్‌ 4న జువ్వాడి రత్నాకర్‌రావు జన్మించారు. ముగ్గురు సోదరుల్లో రత్నాకర్‌రావు పెద్ద. తిమ్మాపూర్‌ సర్పంచ్‌గా  జువ్వాడి.. సుదీర్ఘకాలం సేవలు అందించారు. 1970 దశకం తర్వాత ధర్మపురి దేవస్థానం చైర్మన్‌గా ఆలయాభివృద్ధికి పాటుపడ్డారు. ధర్మపురిలోని సంస్కృతాంధ్ర కళాశాలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1980-81లో రత్నాకర్‌రావు జగిత్యాల పం చాయతీ సమితి అధ్యక్షుడిగా గెలిచారు. 1982 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేశా రు. టీడీపీ అభ్యర్థి టీ జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గా రం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 1994 లో ఓడిపోయి, 1999, 2004లో మళ్లీ గెలుపొందారు. 2007లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్లశాఖ మంత్రిగా రత్నాకర్‌రావు బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో బుగ్గారం నియోజకవర్గం అంతర్థానం కావడంతో రత్నాకర్‌రావు కోరుట్ల నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఓడిపోయారు. వయోభారంతో రాజకీయాలకు దూరమయిన రత్నాకర్‌రావు  కరీంనగర్‌లోని ఇంటికే పరిమితమయ్యారు. రత్నాకర్‌రావుకు భార్య సుమతి, ముగ్గురు కొడుకులు నర్సింగరావు, కృష్ణారావు, చంద్రశేఖర్‌రావు ఉన్నారు. 

పోలీసుల గౌరవ వందనం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో జువ్వాడి అంత్యక్రియలను ఆయన స్వగ్రామం తిమ్మాపూర్‌లోని గోదావరి ఒడ్డున ఆదివారం సాయంత్రం అధికార లాంఛనాలతో నిర్వహించారు. పోలీసులు (ఫ్యూనరల్‌ గార్డ్స్‌) తుపాకుల విన్యాసాలు చేసి.. గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం రత్నాకర్‌రావు పెద ్దకుమారుడు నర్సింగరావు సంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించారు. రత్నాకర్‌రావు పార్థివదేహానికి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు నివాళులర్పించారు. జువ్వాడి మృతికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. జువ్వాడి కుటుంబసభ్యులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో ప్రగాఢ సానుభూతి తెలిపారు.logo