ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 12:58:44

తెలంగాణలో దేవాలయాలకు పూర్వ వైభవం : మంత్రులు

తెలంగాణలో దేవాలయాలకు పూర్వ వైభవం : మంత్రులు

వరంగల్‌ అర్బన్‌ :  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాతే సీఎం కేసీఆర్ అధ్వర్యంలో దేవాలయాలకు పూర్వవైభవం వస్తున్నది. తెలంగాణ  ప్రభుత్వ హయాంలోనే  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు అభివృద్ది చెందుతున్నాయని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్‌లో  ధార్మిక భవన్ నిర్మాణానికి  మంత్రులు బుధవారం భూమి పూజ, శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రూ. 3 కోట్ల అంచ‌నా వ్యయంతో ఈ  భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నామన్నారు. 1014 చ‌ద‌ర‌పు అడుగు విస్తీర్ణంలో నిర్మించ‌నున్న ఈ భ‌వ‌నంలో 5వ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌, జిల్లా సహాయ కమిషనర్ కార్యాల‌యాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ ఈవో కార్యాల‌యం, ఇంజినీరింగ్‌ విభాగాల‌ను ఏర్పాటు చేయ‌నున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాలతో పాటు, దేవాలయాల పునరుద్ధరణకు కూడా సీఎం పెద్ద పీట వేశారన్నారు.


అంతేగాక, వెయ్యి కోట్లతో యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని యాదాద్రిగా అభివృద్ధి పరిచినట్లు చెప్పారు. త్వరలోనే ఆ నూతన దేవాలయ ప్రాంగణం ప్రారంభమవుతుందని మంత్రులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి పారవశ్యం పొంగి పొరలే విధంగా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రులు వివరించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో రాష్ట్రంలో గోదావరి, కృష్ణ పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించిదని, అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల కారణంగా 

తుంగభద్ర పుష్కరాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు సహకరించాలని కోరారు. అనంతరం మంత్రులు కాజీపేటలోని మడికొండ మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాష్ రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.