గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 01:39:18

తెలంగాణలో పండుగలా వ్యవసాయం

తెలంగాణలో పండుగలా వ్యవసాయం
  • రాష్ట్ర ప్రభుత్వ కృషిని అభినందించిన విశ్రాంత సీఎస్‌ మోహన్‌కందా
  • ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో భేటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సాగునీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో రైతులు సంతోషంగా పంటలు పండించే వాతావరణం తెలంగాణలో నెలకొందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా చెప్పారు.  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో సోమవారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ప్రణాళిక, వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్‌ రంగాలతోపాటు పలు అంశాలపై వారు చర్చించారు. వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను వినోద్‌కుమార్‌ వివరించారు. కాళేశ్వరం, శ్రీరాంసాగర్‌ వంటి ప్రాజెక్టుల ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. రానున్నరోజుల్లో కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రైతుబంధు పథకంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.


 వ్యవసాయ, సహకార, నీటిపారుదల, విద్యుత్‌ రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలుచేస్తున్నామని చెప్పారు. అనంతరం మోహన్‌కందా మాట్లాడుతూ.. సాగునీటి వనరులను అందుబాటులోకి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి అభినందనీయమన్నారు. వ్యవసాయాన్ని బతుకుదెరువు కోణంనుంచి వాణిజ్యమార్గంలోకి తీసుకుపోవాలని, తద్వారా రైతులు మరింత ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో ప్రణాళికా సంఘం పాత్ర అత్యంత కీలకమైనదని తెలిపారు. అన్ని శాఖలకు దిశానిర్దేశం చేయాల్సిన గురుతర బాధ్యత ప్రణాళిక సంఘానిదే అని నొక్కిచెప్పారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో మౌలిక, నిర్మాణాత్మక మార్పులు జరుగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్లను విస్తృతంగా ఏర్పాటుచేయాలని, తద్వారా రైతులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్‌ సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు.


logo