శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 02:45:11

‘భారత్‌ వదిలేస్తే.. టెస్టు క్రికెట్‌ అంతమే’

‘భారత్‌ వదిలేస్తే.. టెస్టు క్రికెట్‌ అంతమే’

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా టెస్టు క్రికెట్‌ తీవ్రమైన ప్రమాదంలో పడిందని, సంప్రదాయ ఫార్మాట్‌ పునరుద్ధరణలో భారత్‌ కీలకపాత్ర పోషిస్తుందని తాను ఆశిస్తున్నట్టు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌ చెప్పాడు. ఒకవేళ భారత్‌(బీసీసీఐ) వదిలేస్తే టెస్టు ఫార్మాట్‌ అంతమయ్యే అవకాశం ఉందని బుధవారం ఓ సంస్థ కోసం నిర్వహించిన ఫేస్‌బుక్‌ లైవ్‌లో అతడు చెప్పాడు. ‘ఒకవేళ భారత్‌ వదిలేస్తే టెస్టు ఫార్మాట్‌ అంతమవుతుంది. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మాత్రమే యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ ఆడేలా ప్రోత్సహిస్తున్నాయి. మిగిలిన దేశాలు ఆసక్తి చూపుతున్నట్టు కనిపించడం లేదు. నేను టీ20 క్రికెట్‌కు వ్యతిరేకం కాదు. ఆ ఫార్మాట్‌ను ప్రజలకు సులువుగా చేరువ చేయవచ్చు. టెస్టు క్రికెట్‌కు ఆర్థిక పరమైన తీవ్ర సమస్యలు తలెత్తనున్నాయి. కాకపోతే టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లీ.. టెస్టు క్రికెట్‌ తమకు అత్యుత్తమమని చెప్పడంతో సంప్రదాయ ఫార్మాట్‌ సజీవంగానే ఉంటుందని ఆశిస్తున్నా’ అని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ అన్నాడు. అలాగే తాను ఇప్పటి వరకు చూసిన వారందరిలో భారత జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీనే అత్యంత శక్తివంతమైన బ్యాట్స్‌మన్‌ అని చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. 


logo