బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 12:55:14

కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్‌

కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్‌

హైదరాబాద్‌ : హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు‌ కిడ్నాప్‌ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవరామ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌వీణ్‌తో పాటు సునీల్‌, న‌వీన్‌ను కిడ్నాప్‌ చేశారని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అత‌ని కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప‌ర్ల నుంచి ప్ర‌వీణ్ రావుతో పాటు అత‌ని సోద‌రుల‌ను కాపాడారు.

హఫీజ్‌పేటలో ఉన్న భూమికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, అఖిలప్రియ కుటుంబానికి వివాదాలు నడుస్తున్నట్లుగా స‌మాచారం. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు ఐటీ అధికారుల‌మంటూ ప్రవీణ్‌రావు ఇంట్లోకి ప్రవేశించారు. వారిని ప్రశ్నించాలంటూ ప్రవీణ్‌తో పాటు అతని సోదరులు సునీల్‌, నవీన్‌ను వాహనంలో తీసుకువెళ్లారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ప్ర‌వీణ్‌ను అపహరించారంటూ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపులు చేపట్టారు. సీసీకెమెరాలను పరిశీలించి వారిని తీసుకెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు ప్రవీణ్‌తో పాటు అతని సోదరులను నార్సింగి వద్ద వదిలిపెట్టి పరారయ్యారు. మోయినాబాద్‌ వైపు కిడ్నాప‌ర్లు పారిపోతుండగా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. అఖిలప్రియ, భార్గవరామ్‌ పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  


logo