గ్యాంగ్ సిన్మా చూసి..

- ఖైదీ నంబర్ 1509 కేటాయింపు
- ఏ2గా ఏవీ సుబ్బారెడ్డి పేరు
- సెటిల్మెంట్కు ఒత్తిడి.. ఆపై కిడ్నాప్
- ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు
- కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్టు
- బోయిన్పల్లి కిడ్నాప్ కేసులోఅఖిలప్రియ ఏ-1
- పది రోజులపాటు రెక్కీ
- నకిలీ సెర్చ్ వారెంట్లు, ఐడీకార్డులతో హల్చల్
- డ్రెస్‌లు కుట్టించుకొని పక్కా ప్లాన్‌తో కిడ్నాప్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/మాదన్నపేట: ముగ్గురు వ్యాపారుల కిడ్నాప్ కేసులో బోయిన్పల్లి పోలీసులు కీలకమార్పులు చేశారు. ఏ2గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏ1గా చేర్చారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏ1గా ఉన్న టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా మార్చారు. వీరితోపాటు అఖిలప్రియ భర్త భార్గవరాం ఏ3గా ఉన్నారు. శ్రీనివాస్‌చౌదరి, సాయి, చంటి, ప్రకాశ్ సహా మరికొందరిని నిందితులుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అఖిలప్రియకు చంచల్‌గూడ జైలు అధికారులు యూటీ ఖైదీ నంబర్ 1509 ని కేటాయించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నదని, ఎలాంటి స్పెషల్ క్యాటగిరీ కేటాయించలేదని తెలిపారు. గురువారం ఆమె కుటుంబ సభ్యులు ములాఖాత్‌కు రాగా కొవిడ్ నిబంధనల కారణంగా నిరాకరించారు.
కిడ్నాప్‌కు కారణాలివే
హఫీజ్‌పేటలోని 25 ఎకరాల స్థలాన్ని ప్రవీణ్‌కుమార్ కొనుగోలు చేశారు. ఆ భూమి తమదంటూ ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ అతనితో గొడవకు దిగారు. దీంతో ప్రవీణ్‌కుమార్ సుబ్బారెడ్డికి డబ్బులు ఇచ్చి వివాదాన్ని పరిష్కరించుకున్నారు. తనకు తెలియకుండా సుబ్బారెడ్డి ఎలా సెటిల్ చేసుకుంటారని మండిపడ్డ అఖిలప్రియ తనకూ డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. భూమి విలువ పెరగడంతో ప్రవీణ్‌పై అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాం మరింత ఒత్తిడి పెంచారు. ప్రవీణ్ తలొగ్గకపోవడంతో కిడ్నాప్‌కు స్కెచ్ వేశారు. వారి అనుచరు లు 15 మంది ఐటీ అధికారుల ముసుగులో మంగళవారం రాత్రి బోయిన్‌పల్లిలోని ప్రవీణ్ ఇంటికి వెళ్లారు. నకిలీ సెర్చ్వారెంట్లను చూపించారు. ఇంట్లోవారందరినీ ఓ గదిలో బంధించారు. ఆయనకు, సోదరుల కండ్లకు గంతలు కట్టారు. చేతులు కట్టేసి కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల ఫోన్ ఆధారంగా మెహిదీపట్నం వైపు కిడ్నాపర్లు వెళ్తున్నారని గుర్తించారు. ఆ రూట్లో పోలీసులను అలర్ట్ చేశారు.
కిడ్నాపర్లు గుర్తుతెలియని ప్రాం తంలోని ఫామ్‌హౌస్‌లోకి తీసికెళ్లి బలవంతంగా ఖాళీ బాండ్‌పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని, ఈ సమయంలో కర్రలతో కొట్టారని బాధితులు పేర్కొన్నారు. కిడ్నాపర్లు అఖిలప్రియ, సుబ్బారెడ్డి, భార్గవరాం పేర్లను ప్రస్తావించారని, వాళ్లతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడారంటూ బాధితులు పోలీసులకు వివరించారు. అఖిలప్రియను వెంటనే అరెస్ట్ చేయకుంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, ఆమెది రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతోపాటు ఆమె భర్త భార్గవరాంకు నేర చరిత్ర ఉన్నదని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కిడ్నాప్‌లో పాల్గొన్న వారి కోసం గాలిస్తున్నామని, ఒక వేళ ఆమెను అరెస్ట్ చేయకపోతే బాధిత కుటుంబాలకు ప్రమాదం పొంచి ఉంటుందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నవారి నుంచి వాంగ్మూలం తీసుకున్నట్టు వివరించారు. ఇంట్లో పనిచేసే వంటమనిషి, సమీపంలోని టీస్టాల్ యజమాని ప్రత్యక్ష సాక్ష్యులని పోలీసులు పేర్కొన్నారు.
‘గ్యాంగ్' సినిమా తరహాలో కిడ్నాప్
తెలుగులోకి డబ్బింగ్ అయిన తమిళ సినిమా గ్యాంగ్ స్ఫూర్తితో కిడ్నాప్‌కు వ్యూహరచన చేశారు. నాలుగైదుసార్లు సినిమా చూసిన కిడ్నాపర్లు పది రోజుల పాటు రెక్కీ నిర్వహించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. తమ కుటుంబంతో చాలా ఏండ్లుగా సన్నిహితంగా ఉంటున్న శ్రీనివాస్చౌదరితో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ కిడ్నాప్‌పై చర్చించారు. ఆ తర్వాత చంటి, ప్రకాశ్‌తోపాటు మరికొందరిని గ్యాంగ్‌లో చేర్చుకున్నారు. అందరికీ గ్యాంగ్ సినిమా చూపించారు. అందులో ఒక మహిళా అధికారి ఉండాలని మొదట భావించి తర్వాత విరమించుకున్నారు. అందరూ ఒకేలా ఉండే విధంగా డ్రెస్సులను నగర శివారు ప్రాంతంలో కుట్టించారని చెప్తున్నా.. మరికొందరు ఆళ్లగడ్డలో కుట్టించారని అంటున్నారు.
పాఠశాల ఆవరణలో నంబర్ ప్లేట్లు మార్పు
ప్రవీణ్ సోదరుల ఇంటికి ఐటీ అధికారుల రూపంలో సోదాలకు వెళ్లే ముందు నగర శివారు ప్రాంతంలోని అఖిల, ఆమె భర్త భార్గవ్‌కు తెలిసిన వారి పాఠశాల ఆవరణలో కార్ల నంబర్ ప్లేట్లను మార్చారు. అప్పటికే నకిలీ సెర్చ్ వారెంట్లు, ఐడీకార్డులను భార్గవ్ తనకు తెలిసిన వారి వద్ద తయారు చేయించి కిడ్నాపర్లకు అందించారు. ఇంట్లోకి ప్రవేశించగానే తమను తాము ఐటీ అధికారులుగా చెప్పుకొన్నారు. అందరు ఇంట్లో కలియ తిరిగి ముం దుగా భూమి పత్రాలు దొరికితే వాటిని స్వాధీనం చేసుకోవాలని భావించారు. కుటుంబ సభ్యులకు అనుమానాలు రాకుండా ఒక్కొక్కరినీ విచారిస్తామని చెప్పి.. ముందుగా అందరినీ ఒకే గదిలోకి పంపి నిర్బంధించారు. ఆ తరువాత ముగ్గురు అన్నదమ్ములను అక్కడి నుంచి కిడ్నాప్ చేశారు.
తాజావార్తలు
- ముగిసిన బ్రహ్మోత్సవాలు
- ‘హాల్‌మార్క్' నిర్వాహకుల ఇష్టారాజ్యం
- టీఆర్ఎస్ నాయకుడి పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా
- టీకా వచ్చేసింది.. ఆందోళన వద్దు
- మహమ్మారి అంతానికి నాంది
- తెలంగాణ భవన్ త్వరగా పూర్తి చేయాలి
- ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం కృషి
- మెరిసిన గిరిజన విద్యార్థి
- కరోనా వ్యాక్సిన్ తయారీ గర్వకారణం
- వ్యాక్సిన్ సురక్షితం.. భయపడొద్దు