మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:13:33

అటవీ పునరుద్ధరణ అద్భుతం

అటవీ పునరుద్ధరణ అద్భుతం

  • డీజీపీ మహేందర్‌రెడ్డి కితాబు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గజ్వేల్‌ ప్రాంతంలో అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి కితాబిచ్చారు. అడవుల పునరుద్ధరణ, అటవీ పరిశోధన కేంద్రాల స్థాపనపై తెలంగాణ ప్రభుత్వం, అటవీశాఖ కలలు ఫలించాయని చెప్పారు. గజ్వేల్‌ అటవీప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా పోలీసు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ములుగు అటవీకళాశాల, పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన డీజీపీకి.. అటవీశాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ, పీసీసీఎఫ్‌ (ఎస్‌ఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌ అడవుల పునరుద్ధరణ పనులను వివరించారు. పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ మాట్లాడుతూ.. అడవుల్లో ఉన్న రూట్‌స్టాక్‌ను ఉపయోగించుకొని సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామని తెలిపారు. చుట్టూ కందకాలు తీయడంతో అడవికి రక్షణ ఏర్పడటంతోపాటు, వాటిల్లో నిల్వ ఉండేనీటి కారణంగా చెట్టకు కావాల్సిన తేమ అందుతుందని వివరించారు. అడవుల పునరుద్ధరణతో వాతావరణ సమతుల్యత, జీవవైవిధ్యానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డీజీపీ మాట్లాడుతూ.. కేరళ, మెట్టుపాలయం (తమిళనాడు) మాదిరిగా అటవీ కాలేజీ, యాదాద్రి నమూనా స్ఫూర్తిగా చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులు మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. 

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో అటవీశాఖతోపాటు, అన్ని ప్రభుత్వశాఖలు భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారని.. ఇందులో పోలీస్‌శాఖ ముందు వరుసలో నిలిచిందని చెప్పారు. కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలను చేపట్టామని, ఉపాధిహామీ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్‌ విజయవంతమైందని, దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని తెలిపారు.