ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 22:03:24

ఆ పులిని పట్టుకుంటాం: సీఎఫ్‌వో వినోద్‌కుమార్‌

ఆ పులిని పట్టుకుంటాం: సీఎఫ్‌వో వినోద్‌కుమార్‌

పెంచికల్‌పేట్‌: గిరిజన బాలికను  చంపిన పులిని త్వరగా పట్టుకుంటామని సీఎఫ్‌వో సీపీ విదోన్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం కొండపెల్లి గ్రామానికి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌తో కలిసి వెళ్లి పులి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎఫ్‌వో మాట్లాడుతూ.. పత్తి ఏరుడుతుండగా నిర్మలపై దాడిచేసిన పులిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు, రెండు ఫ్లైయింగ్‌   స్వాడ్‌, మరో రెండు మహారాష్ట్ర బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అటవీ ప్రాంతంలో అక్కడక్కడా సీసీ కెమెరాలు పెట్టామని, నాలుగు బోన్లు ఏర్పాటు చేసి అందులో ఎరగా దూడలను ఉంచుతామని తెలిపారు. అనంతరం నిర్మల కుటుంబాన్ని పరామర్శించారు. 

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. బాలిక అన్న రాజేశ్‌, చెల్లె సంగీత, తమ్ముళ్లు మల్లయ్య, గుండయ్యలను రెసిడెన్సియల్‌ పాఠశాలలో చదివిస్తామని, తండ్రికి అటవీశాఖలో ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పులి దాడిచేసిన స్థలాన్ని సీఎఫ్‌వో, అధికారులతో కలిసి పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 11న విఘ్నేశ్‌పై దాడి చేసిన పులి, నిర్మలపై దాడి చేసిన పులి ఒకటి కాదని సీఎఫ్‌వో తెలిపారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంపిన రూ. 15 వేలను సర్పంచ్‌లు జాజిమొగ్గ శ్రీనివాస్‌, ఉపాసి సంజీవ్‌, మాజీ సర్పంచ్‌ సుధాకర్‌ అందజేశారు. రాష్ట్ర ఆదివాసీ తుడుందెబ్బ తరపున రూ. 5 వేలు, తహసీల్దార్‌ రఘునాథ్‌రావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. జిల్లా అటవీ అధికారి శాంతారాం, డీఎఫ్‌వో విజయ్‌కుమార్‌, డీఎస్పీ బీఎల్‌ఎన్‌స్వామి, ఎఫ్‌ఆర్వోలు వేణుగోపాల్‌, దయాకర్‌, సీఐ నరేందర్‌, పోలీసులు, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు. కాగా, నిర్మల మృతదేహాన్ని సోమవారం రాత్రి పోస్టుమార్టం కోసం అంబులెన్స్‌లో సిర్పూర్‌(టి)కి తరలిస్తుండగా గొల్లదేవర సమీపంలో పులి అడ్డం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.