బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 13:38:26

అట‌వీ అధికారులు అంకితభావంతో ప‌ని చేయాలి: మంత్రి అల్లోల

అట‌వీ అధికారులు అంకితభావంతో ప‌ని చేయాలి: మంత్రి అల్లోల

హైద‌రాబాద్: అటవీ సంపదను కాపాడేందుకు అటవీ అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారన్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. అటవీ అధికారులు మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. సోమవారం అర‌ణ్య భ‌వ‌న్‌లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి‌తో కలిసి తెలంగాణ జూనియ‌ర్ అట‌వీ అధికారుల‌  సంఘం డైరీ, క్యాలెండ‌ర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణులు, అటవీ సంపదను కాపాడేందుకు అట‌వీ అధికారులు అంకిత భావంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలో అడవులను కాపాడటంలో, పెంచడంలో జూనియర్ అటవీ అధికారుల పాత్ర అమూల్యమైన‌ద‌ని, క్షేత్ర స్థాయి సిబ్బంది పనితీరు వల్లే సత్ఫలితాలను సాధించ గ‌లుగుతున్నామ‌ని తెలిపారు. 

జంతు జాలాన్ని, ప్రకృతి సంపదను పరిరక్షించే క్రమంలో పలువురు అటవీ సిబ్బంది తమ ప్రాణాలను సైతం కోల్పోయిన సంద‌ర్భాలున్నాయని చెప్పారు. రాష్ట్ర సాధన తర్వాత సీఎం కేసీఆర్ అడ‌వుల ర‌క్షణ‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నార‌ని, హ‌రిత హారం కార్యక్రమం వ‌ల్ల తెలంగాణ‌లో ప‌చ్చద‌నం పెరి‌గింద‌ని గుర్తు చేశారు. అట‌వీ శాఖ‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భ‌ర్తీ చేశామ‌ని, మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించామ‌న్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం స‌ర్కారు ఎన్నో నిర్ణయాలు తీసుకుంద‌ని, త్వరలోనే పీఆర్సీ, ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు, త‌దిత‌ర అకాంక్షల‌న్ని త్వర‌లోనే నెర‌వేర‌నున్నాయ‌ని పేర్కొన్నారు.


logo