బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 01:52:21

పరాయి లీడర్లు.. కిరాయి క్యాడర్‌

పరాయి లీడర్లు.. కిరాయి క్యాడర్‌

  •  దుబ్బాకలో కాంగ్రెస్‌ ప్రచారానికి బయటివారు 
  •  స్థానికంగా కార్యకర్తలు లేక ఇక్కట్లు 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రచారానికి పరాయి లీడర్లు.. కిరాయి మనుషులను తెచ్చుకుంటున్నారు. స్థానికంగా ఆ పార్టీకి క్యాడర్‌ లేకపోవడం.. ప్రజల్లో ఆదరణ లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి అద్దెకు జనాన్ని తీసుకొచ్చి ఈ నెల 15న ఆ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి చేత నామినేషన్‌ వేయించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ప్రజలతో నామినేషన్‌ వేసిన పరిస్థితులు ఉన్నాయంటే ఇక్కడ కాంగ్రె స్‌ పార్టీ స్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు ఆ పార్టీలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. దీంతో దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అయ్యింది. గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేద్దామంటే వీరిని చూసి ప్రజలు ఉండటం లేదు. చివరికి కార్యకర్తలకు నాలుగు ముచ్చట్లు చెప్పుదామంటే క్యాడర్‌ లేదు. దీంతో వారి వెంట తెచ్చుకున్న నాయకులతో నాలుగు ఊర్లు ఇలా తిరిగి అలా వెళ్తున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా బలహీనం కావడంతో పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల దుబ్బాకలో పర్యటించిన ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కంఠాకూర్‌ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులతో సమావేశమై పలు సూచనలు చేశారు. స్థానికంగా క్యాడర్‌ లేని విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు తమ ప్రాంతానికి చెందిన లీడర్లు, కార్యకర్తలను తీసుకొచ్చారు.  సంగారెడ్డి, మేడ్చల్‌, నర్సాపూర్‌, కరీంనగర్‌, వేములవాడ తదితర ప్రాంతాల నుంచి సుమారు 15 డీసీఎంలలో జనాన్ని తీసుకువచ్చారు. ఒక్కొక్కరికి రూ.400 నుంచి రూ.600 వరకు ఇచ్చి, భోజన సదుపాయాలు కల్పించారని సమాచారం. దుబ్బాక తెలంగాణ తల్లి వద్ద సభను ఏర్పాటు చేయగా.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు మధ్యలోనే వెళ్లిపోయారు. మేం వచ్చాం.. పోతున్నాం.. నాయకుల ప్రసంగాలతో మాకేం పని అన్నట్టు అక్కడికి వచ్చిన ఇతర జిల్లాల కాంగ్రెస్‌ నాయకులు చెప్పడం కొసమెరుపు.


logo