గురువారం 16 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:47

ఫుడ్‌ప్రాసెసింగ్‌కు ప్రత్యేక జోన్లు

ఫుడ్‌ప్రాసెసింగ్‌కు ప్రత్యేక జోన్లు

  • రాష్ట్రంలో వ్యాపారానికి చాన్స్‌ 
  • జలవిప్లవంతో భిన్న ఉత్పత్తులు 
  • పెట్టుబడిదారులకు సహకారం 
  • ఇన్వెస్ట్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరం వెబినార్‌లో ఐటీ మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర వ్యవసాయరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఫుడ్‌ప్రాసెసింగ్‌రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రత్యేకంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జలవిప్లవం ద్వారా వ్యవసాయంరంగంతోపాటు పా లు, మాంసం, చేపల ఉత్పత్తుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. వీటిద్వారా ప్రాసెసింగ్‌, అగ్రికల్చర్‌రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు.

సోమవారం ఇన్వెస్ట్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరం నిర్వహించిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్టార్‌ ఎడిషన్‌ వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నా రు. ప్రపంచవ్యాప్తంగా 200 మంది వ్యవసాయ, ఫుడ్‌ప్రాసెసింగ్‌ పెట్టుబడిదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రం లో రెడీటుఈట్‌, బేవరెజెస్‌, కూరగాయలు, పండ్లు, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ఈ సందర్భంగా మంత్రికి వారు వివరించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈవోడీబీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని, తద్వారా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు ఎం తో సౌకర్యవంతమని తెలిపారు. 

ఇప్పటికే అనేకరంగాల్లో ప్రపంచస్థాయి పరిశ్రమలను ఆకర్షించామని, ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగంలో నూ అనేక పెద్దసంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అందుబాటులోకొచ్చిన నీటి వనరులతో వ్యవసాయరంగంలో భిన్నమైన ఉత్పత్తులకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. వ్యవసాయ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తెలంగాణకు భౌగోళికంగా ఉన్న అవకాశాలను కూడా వివరించారు. రాష్ట్రంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగానికి ప్రత్యేకంగా పారిశ్రామికవాడలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. 

తాజావార్తలు


logo