ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:30

పరిశ్రమలకు స్వాగతం

పరిశ్రమలకు స్వాగతం

  • త్వరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్‌ పాలసీలు
  • రిటైల్‌ ట్రేడ్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ విధానాలూ..   
  • పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయం
  • వడివడిగా ప్రభుత్వం అడుగులు 
  • తుదిరూపు తర్వాత క్యాబినెట్‌ ముందుకు..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అందివచ్చిన సదావకాశాన్ని ఒడిసిపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. కరోనా వైరస్‌ ప్రభావం, చైనా వ్యవహారశైలితో ఆ దేశంలో నెలకొల్పిన తయారీ యూనిట్లను వేరే చోటుకు తరలించాలని అనేక పరిశ్రమలు నిర్ణయించాయి. ఆ పరిశ్రమలను రాష్ర్టానికి రప్పించేందుకు ప్రత్యేక పాలసీలను తీసుకురాబోతున్నది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఇదే సరైన సమయమని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ఇప్పటికే టీఎస్‌ఐపాస్‌తో పరిశ్రమలకు ఘనస్వాగతం పలికిన సర్కారు.. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందకు ప్రత్యేక పాలసీలపై దృష్టిపెట్టింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌, రిటైల్‌ ట్రేడ్‌, లాజిస్టిక్‌ పాలసీలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. వీటికి సంబంధించి ముసాయిదా పాలసీలు రెడీగా ఉండగా, తుదిరూపు ఇవ్వాలని అధికారులను ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. కాగా, తదుపరి జరిగే క్యాబినెట్‌ సమావేశంలో ఈ పాలసీలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు కావాల్సినన్ని వనరులు

రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లున్నాయి.. కావాల్సినంత కరెంటు ఉన్నది.. పంటలకు పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నది.. ఫలితంగా పంటల సాగు, దిగుబడి గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పండిన పంటలను ప్రాసెసింగ్‌ చేసి అమ్మకాలు చేపడితే రైతులకు లబ్ధి చేకూరుతుందని, వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అంచనా వేశారు. దానికోసం పెద్దఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీనికోసం భూ సేకరణ కూడా చురుగ్గా సాగుతున్నది. ఈ పరిశ్రమలో మహిళా సంఘాలను కూడా భాగస్వాములను చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పాలసీ ఉంటే మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

ఈవీలో భారీపెట్టుబడులు

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ)దే. రాబోయే రోజుల్లో ఈ రంగం వేగంగా పుంజుకోనున్నది. డిమాండ్‌, ఇక్కడ ఉన్న మార్కెటింగ్‌ అవకాశాల దృష్ట్యా ఈవీ బస్సుల తయారీకి తెలంగాణలో యూనిట్లు పెడతామని ఇప్పటికే మూడు కంపెనీలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. ఈ నేపథ్యంలో ఈవీకి ప్రత్యేక పాలసీ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి రాష్ర్టాన్ని అడ్డాగా మార్చేందుకు, ఆ వాహనాలకు అవసరమైన చార్జింగ్‌ స్టేషన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు స్థలాలను కూడా కేటాయించనున్నారు. ఈ పాలసీలో ప్రధానంగా తయారీదారులు, వినియోగదారులు, మద్దతుదారులకు విద్యుత్తు, పన్ను రాయితీల ప్రయోజనం కల్పించనున్నారు. పాలసీపై సొసైటీ ఆఫ్‌ మాన్యుఫాక్చరర్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఎస్‌ఎంఈవీ) తమ ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది.

రిటైల్‌ రంగంపై దృష్టి

తెలంగాణలో రిటైల్‌ వ్యాపారం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నది. టైర్‌-2, 3 పట్టణాలు, జనాభా అధికంగా ఉన్న పంచాయతీల్లో రిటైల్‌ వ్యాపారాలపై ప్రభుత్వానికి ఒక విధానం ఉండాలనే ఉద్దేశంతో కొత్తగా పాలసీని రూపొందిస్తున్నది. కార్మిక చట్టాల్లో మార్పులు తెచ్చి, చిన్న, మధ్యతరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనున్నది. ఈ పాలసీలో ప్రధానంగా సింగిల్‌ విండో అనుమతులకు నోడల్‌ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించనున్నది. ఈ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రవాణా చార్జీల్లేకుండా వినియోగదారులకు తక్కువ ధరలకే వస్తువులు, సరుకులు విక్రయించే అవకాశం ఉంటుంది.

లాజిస్టిక్‌కు అనుకూల ప్రాంతం

భౌగోళికంగా, వాతావరణ పరంగా తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతం. దక్షిణాది, ఉత్తరాది మధ్యలో ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ లాజిస్టిక్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయని, ఈ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పెద్ద ఎత్తున లాజిస్టిక్‌ పార్కులను తీసుకురావాలని చూస్తున్నది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక పాలసీ ఉంటే సులువవుతుందని భావిస్తున్నది. దీనికి అనుగుణంగా లాజిస్టిక్‌ పాలసీని అందుబాటులోకి తీసుకురానున్నది.logo