మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:33

జిల్లాకో ఆహార పార్కు

జిల్లాకో ఆహార పార్కు

  •  నియోజకవర్గానికో పరిశ్రమ
  • భూమి గుర్తింపులో అధికారులు
  • ఇండస్ట్రీల ఏర్పాటుకు నూతన పాలసీ 
  • ఆగస్టు మొదటివారంలో వచ్చే చాన్స్‌
  • అన్నదాతకు ఆదాయం.. వినియోగదారుడికి కల్తీలేని ఆహారమే ప్రభుత్వ లక్ష్యం

అన్నదాతకు అధిక ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాకో ఫుడ్‌ ఇండస్ట్రీ పార్కుతోపాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది. వానకాలం పంటల సాగు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సీజన్‌ ఉత్పత్తులు చేతికొచ్చేలోగా వీటిని ఏర్పాటుచేసి రైతన్నకు ప్రత్యక్షంగా లాభాలు చూపించాలని ఆలోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేలా నూతన పాలసీని రూపొందిస్తున్నది. వచ్చే నెల మొదటివారంలో పాలసీ వచ్చే అవకాశాలున్నాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. జీహెచ్‌ఎంసీలో మినహా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంచేసింది. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో కనీసం 300 నుంచి 500 ఎకరాల విస్తీర్ణంతో ఒక్క ఫుడ్‌ ఇండస్ట్రీ పార్కును ఏర్పాటుచేయనున్నది. ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉన్న భూమిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. రైతులంతా నియంత్రిత పంటల సాగు చేపట్టిన నేపథ్యంలో ఈ వానకాలంలోనే అన్నదాతలకు ప్రత్యక్షంగా లాభాలు చూపించాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. తద్వారా అన్నదాతకు అధికాదాయంతోపాటు వినియోగదారులకు కల్తీలేని నాణ్యమైన ఆహారం లభ్యం కానున్నది.

టీఎస్‌ఎఫ్‌పీఎస్‌ ఏర్పాటు


తెలంగాణ విభిన్న పంటలకు నిలయం.. దక్కన్‌ పీఠభూమి అయిన తెలంగాణలో పండే పంటలు చాలా రుచికరంగా ఉంటాయి. దీంతో ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్నది. ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో రైతులు పండించే పంటలన్నింటినీ ప్రాసెస్‌చేసి విక్రయిస్తే భారీ ఎత్తున లాభాలు వస్తాయి. రైతుల పంటకు లాభసాటి ధర పలుకుతుంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ (టీఎస్‌ఎఫ్‌పీఎస్‌)ని ఏర్పాటుచేసింది. ఈ సొసైటీ ద్వారా తృణ, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, ఫౌల్ట్రీ, చేపల ఉత్పత్తులను ప్రాసెస్‌చేసే యూనిట్లకు ప్రోత్సాహకాలు అందించే దిశగా సర్కారు కసరత్తుచేస్తున్నది. ఈ మేరకు రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేలా నూతన పాలసీని రూపొందిస్తున్నది. వచ్చే నెల మొదటివారంలో పాలసీ వచ్చే అవకాశాలున్నాయి.

పంటల దిగుబడిలో మేటి

తెలంగాణలో పంటల దిగుబడి భారీగా పెరిగింది. కాళేశ్వరంతోపాటు పలు ప్రాజెక్టులు పూర్తికావడంతో సాగునీటి ఇబ్బందులు తప్పాయి. రైతులు రెండు పంటలు పండించే అవకాశం ఏర్పడింది. ఈ ఏడాది సాగు విస్తీర్ణం 1.20 కోట్ల ఎకరాలకు చేరుకొనే అవకాశం ఉన్నది. ఈ వర్షాకాలం సీజన్‌లో ఇప్పటికే 70శాతంపైగా పంటలు సాగయ్యాయి. మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో పంటలు వేయనున్నారు. దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. మరోవైపు పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. చేపలు, గొర్రెలు, మేకల పెంపకం కూడా బాగా పెరిగింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న సర్కారు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌చేసుకోవడానికి వీలుగా ఫుడ్‌ పార్కుల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది.

ఈ ఉత్పత్తులు అనుకూలం

వ్యవసాయ, ఉద్యాన, పాలు, ఫౌల్ట్రీ, మాంసం ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా  బియ్యం, మక్కజొన్న, పత్తి, కంది, మిరప, సోయ, వేరుశెనగ, చెరకు, మామిడి, బత్తాయి, జామ, ఉసిరి, పుచ్చకాయ, కీర, క్యారెట్‌, టమాట, పసుపు, బెండకాయ, గుడ్లు, కోడి మాంసం, గొర్రెలు, మేకల మాంసం, చేపలు, పాలు ప్రాసెస్‌చేసి విక్రయించడానికి, ఎగుమతిచేయడానికి మంచి అవకాశాలున్నాయి. ఆయా జిల్లాలవారీగా సాగుచేస్తున్న పంటలు, వచ్చిన దిగుబడిని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. జిల్లాల్లో ఆ పంటల నిల్వకు గోదాముల సామర్థ్యం, మార్కెటింగ్‌పై పరిశీలనచేస్తున్నారు. ఈ లెక్కల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు.

పెట్టుబడికి అపూర్వ అవకాశాలు

తెలంగాణ వ్య వసాయరంగం లో విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో రాష్ట్రం లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అపూర్వమైన పెట్టుబడి అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిం ది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌రంగంలో పెట్టుబడిదారులకు అవసరమైన సాయం అందిస్తాం. అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌రంగంలో  పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.-గత నెలలో ఇన్వెస్ట్‌ ఇండియా ‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంపై నిర్వహించిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌logo