మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 02:40:36

వ్యక్తిగత దూషణలు కూడదు

వ్యక్తిగత దూషణలు కూడదు

  • అందరూ నియమావళి పాటించాలి
  • జీహెచ్‌ఎంసీలో ఓటరైతే పోటీ చేయొచ్చు
  • పారదర్శకంగా ఓటర్ల జాబితా 
  • నేడు తుది జాబితా విడుదల
  • రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి
  • సోషల్‌ మీడియా కథనాలపై దృష్టిపెట్టండి: టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని  రాష్ట్ర ఎన్నికల  కమిషనర్‌ పార్థసారథి తెలిపారు. అన్ని రాజకీయపార్టీలు, అభ్యర్థులు  సంయమనం పాటిస్తూ.. వ్యక్తిగత దూషణలు చేసుకోవద్దని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఎస్‌ఈసీకి సహకరించాలని కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో గురువారం పార్థసారథి భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు జీహెచ్‌ఎంసీలో ఓటరు అయి ఉండాలని తెలిపారు. 2016 నాటి రిజర్వేషన్లే ఈ ఏడాది కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ వార్డులవారీగా ఓటర్ల జాబితా రూపకల్పన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, మోడల్‌ కోడ్‌, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తదితర అంశాలపై పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఈసీ చర్చించారు. 

2021 ఫిబ్రవరి 10 నాటికి జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగుస్తుందని, ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉన్నదని పార్థసారథి తెలిపారు. 150 డివిజన్లకు ఓటర్ల జాబితా ముసాయిదాను బుధవారమే విడుదలచేశామని చెప్పారు. అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం శుక్రవారం తుది జాబితా విడుదలచేస్తామని వెల్లడించారు. మరోవైపు డివిజన్ల వారీగా పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు మొదలైందని, శుక్రవారం ముసాయిదా వెల్లడి స్తామని.. అభ్యంతరాల స్వీకరణ అనంతరం 21న పోలింగ్‌ కేంద్రా ల తుది జాబితాను విడుదలచేస్తామని పార్థసారథి వెల్లడించారు. తుది జాబితా లోపే.. డివిజన్‌ డీ లిమిటేషన్‌ బౌండరీల ప్రకా రం.. ఆ డివిజన్‌లో నివసించే ఓటర్లను అక్కడే ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ భేటీలోఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌, జాయింట్‌ సెక్రటరీ జయసింహారెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ విష్ణుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు పిల్లల నిబంధనపై పిటిషన్‌ 

ఇద్దరికంటే ఎక్కువ సంతానమున్నవారిని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొనడాన్ని సవాల్‌చేస్తూ హైకోర్టులో హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్‌బాబు రవి, మహమ్మద్‌ తాహెర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇతర మున్సిపాల్టీల్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానమున్నవారిని పోటీ కి అనుమతిస్తూ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం.. జీహెచ్‌ఎంసీలోనే ఈ నిబంధనను కొనసాగించడం అన్యాయమని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ సెక్షన్‌ 21బీ ప్రకారం పిటిషనర్లను డిస్‌క్వాలిఫై చేయకుండా ఆదేశించాలని కోరారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం.. ఈనెల 18 నాటికి వివరణ సమర్పించాలని పేర్కొంటూ విచారణను 19కి వాయిదా వేసింది.

సామాజిక మాధ్యమాలపై దృష్టి పెట్టండి: టీఆర్‌ఎస్‌

ఎస్‌ఈసీ భేటీకి టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ జనరల్‌ సెక్రటరీ భరత్‌ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ తీసుకొంటున్న చర్యలు బాగున్నాయని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే ఎన్నికల కథనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరినట్టు వెల్లడించారు. సోషల్‌మీడియా కట్టడికి ప్రత్యేక సెల్‌  ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశామని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పెంచాలని, దివ్యాంగులు, కొవిడ్‌ రోగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరామని తెలిపారు. ఓటర్ల లిస్టులో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని మిగిలిన పార్టీల నేతలు కోరారు. కాంగ్రెస్‌ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్‌ బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీటీడీపీ నేతలు జ్యోత్స్న, ప్రఫుల్‌రెడ్డి ఎస్‌ఈసీతో భేటీ అయిన వారిలో ఉన్నారు.