శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 01:35:58

ప్రజలు మెచ్చిన బడ్జెట్‌

ప్రజలు మెచ్చిన బడ్జెట్‌
  • మండలిలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన పురాణం సతీశ్‌

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజలుమెచ్చిన సంక్షేమబడ్జెట్‌ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ అన్నారు. బుధవారం ఆయన శాసనమండలిలో 2020-21 వార్షిక బడ్జెట్‌ పైచర్చను ప్రారంభించారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్టరద్దు, జీఎస్టీ నిర్ణయాలతో దేశఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిందని తెలిపారు. దేశ విశాల ప్రయోజనాల కోసమే జీఎస్టీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్దతిచ్చిందని చెప్పారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణకు ఒక్కరూపాయి ఇవ్వనని ప్రకటించిన అసెంబ్లీలో.. నేడు రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, దానికి సంబంధించి చర్చలో పాల్గొనడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమానికి కోతపెట్టకుండా ప్రజల కొనుగోలుశక్తి పెంచేలా రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం హర్షణీయమని తెలిపారు. అంతకుముందు బీజేపీ సభ్యుడు ఎం రామచంద్రరావు మాట్లాడుతూ.. మహిళా వర్సిటీ ఏర్పాటుచేయాలని, ఎంఎంటీఎస్‌ రెండోదశకు నిధులు విడుదలచేయాలని కోరారు.


వచ్చే నాలుగేండ్లు అభివృద్ధిపైనే దృష్టి:వీ గంగాధర్‌గౌడ్‌ 

రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అధికారపార్టీకి బ్రహ్మరథం పట్టారని.. ప్రస్తుతం అన్ని ఎన్నికలు పూర్తికావడంతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుందని ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యతను కల్పించారని చెప్పారు. 


మైనార్టీలకు నిధులు పెంచినందుకు ధన్యవాదాలు: రియాజ్‌ ఇఫెండి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నదని.. గతంలో ఏ ప్రభుత్వాలు మంజూరుచేయని రీతిలో నిధులను కేటాయిస్తున్నదని ఎంఐఎం ఎమ్మెల్సీ రియాజ్‌ ఉల్‌హసన్‌ ఇఫెండి ప్రశంసించారు. బడ్జెట్‌లో మైనార్టీలకు నిధులు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. షాదీముబారక్‌ పథకం ద్వారా 1.44 లక్షల మంది మైనార్టీలకు ప్రయోజనం కలిగిందన్నారు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలకు ఆదరణ పెరుగుతున్నదని చెప్పారు.


logo