గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:12

కృష్ణా బేసిన్‌కు వరద

కృష్ణా బేసిన్‌కు వరద

  • ఆల్మట్టికి 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • జూరాలకు 4,074క్యూసెక్కులు రాక
  • గోదావరి బేసిన్‌లోనూ ప్రవాహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణా, గోదావరి బేసిన్‌లలో ఇప్పుడిప్పుడే వరద ప్రారంభమైంది. సోమవారం ఆల్మట్టికి దాదాపు 30 వేల క్యూసెక్కుల వరకు వరద వచ్చింది. దీంతో 129.82 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం ఉన్న ఆల్మట్టి జలాశయంలో నీటినిల్వ 76 టీఎంసీలకు చేరుకున్నది. దిగువన నారాయణపూర్‌ జలాశయానికి మాత్రం అదే స్వల్పంగా వరద వస్తున్నది. ఉజ్జయినికి మూడున్నర వేల క్యూసెక్కులు, తుంగభద్రకు పన్నెండు వేల క్యూసెక్కుల వరకు వస్తున్నది. 

జూరాలకు స్వల్పంగా తగ్గిన వరద

జూరాలకు సోమవారం వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. ప్రాజెక్ట్‌ పూర్తి నీటిసామర్థ్యం 9.66 టీఎంసీలకుగాను 7.28 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 4,074క్యూసెక్కులు కాగా 1,331 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా ఎత్తిపోతలకు 474 క్యూసెక్కుల నీటిని వదిలారు.

గోదావరి బేసిన్‌లో..

గోదావరి బేసిన్‌లో ఇప్పుడిప్పుడే ప్రవాహం కనిపిస్తున్నది. ప్రస్తుతం 30వేల పైచిలుకు క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతున్నది. పేరూరు (ఉమ్మడి ఖమ్మం-వరంగల్‌ సరిహద్దు) దగ్గర సోమవారం 30,016 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తున్నది. అటు ప్రాణహిత, ఇటు ఇంద్రావతి నుంచి వరద క్రమంగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది. ఎగువన బాబ్లీ గేట్లు ఎత్తడంతోపాటు ఎస్సారెస్పీ పరీవాహకంలో కురిసిన వర్షాలతో ఆ జలాశయం వద్ద సోమవారం ఐదున్నర వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కడెంకు వరద స్వల్పంగా పెరిగింది. 948 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. దిగువన ఎల్లంపల్లికి కూడా 868 క్యూసెక్కుల వరద వస్తున్నది. ధవళేశ్వరం వద్ద కూడా వరద కాస్త పెరిగి 26 వేల క్యూసెక్కుల పైచిలుకుగా నమోదవుతున్నది. ఈ క్రమంలో ధవళేశ్వరం పరిధిలో కాల్వలకు 8,300 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్న అధికారులు దిగువన సముద్రంలోకి 17 వేల పైచిలుకు క్యూసెక్కులను వదులుతున్నారు. 

నిండుకుండలా గోదారి..

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నిండుకుండలా ప్రవహిస్తున్నది. మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోడుగా ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది నుంచి గోదావరి నదిలోకి వరద పరవళ్లు తొక్కుతున్నది. దీంతో కాళేశ్వరం వద్ద సోమవారం 30,500 క్యూసెక్కుల నీటితో నది ప్రవహిస్తున్నది. పుష్కర ఘాట్‌ వద్ద 5.2 మీటర్ల ఎత్తుకు నీటి ప్రవాహం చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

తాలిపేరు.. పరవళ్లు

చర్లరూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు సోమవారం వరద పోటెత్తింది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా సాయంత్రానికి 73.380 మీటర్లకు చేరుకున్నది. అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 7 గేట్లను అడుగు మేర ఎత్తి3,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 


logo