గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 08:05:40

కృష్ణానదికి పొటెత్తుతున్న వరద.. ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

కృష్ణానదికి పొటెత్తుతున్న వరద.. ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

జోగులాంబ గద్వాల/శ్రీశైలం/నాగార్జునసాగర్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 1,74,500 క్యూసెక్కుల వరద వస్తోంది.16 గేట్ల ద్వారా 1,38,910 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.  జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు 9.657 (టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1043 అడుగులు (8.473 టీఎంసీలు)గా ఉంది.

శ్రీశైలం జలాశయానికి 1,74,869 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 210.9 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,75,680 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 22,756 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో దాదాపు 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరింది. నాగార్జున సాగర్‌ జలాశయానికి సుమారు 4 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు 2,79,057 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్‌ సైతం ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో 16 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,79,057 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589 అడుగులు (309.5 టీఎంసీలు) గా ఉంది. రానున్న 24 గంటల్లో నాగార్జునసాగర్‌కు వరద మరింత పెరిగే అవకాశముంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo