శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 02:31:43

ఐదుగురిని మింగిన నిద్రమత్తు

ఐదుగురిని మింగిన నిద్రమత్తు

  • రంగారెడ్డి జిల్లా సుద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • కారులోని నలుగురు విద్యార్థులు సహా డ్రైవర్‌ మృతి
మాడ్గుల: సరదాగా నాగార్జున సాగర్‌ను వీక్షించేందుకు కారులో బయలుదేరిన ఎంబీఏ విద్యార్థులు.. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో నలుగురు విద్యార్థులతోపాటు డ్రైవర్‌ కూడా దుర్మరణం చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామం వద్ద సాగర్‌ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నుంచి ఎంబీఏ విద్యార్థులు శివభాస్కర్‌, భరత్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీకాంత్‌రెడ్డిలు డ్రైవర్‌ నాగేంద్రతో కలిసి కారులో నాగార్జునసాగర్‌కు బయలుదేరారు. మాడ్గుల మండలం సుద్దపల్లి గేటు సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడం, అదే క్రమంలో కారు వేగంగా ఉండటంతో అదుపుతప్పి సాగర్‌ హైవే పక్కనే ఉన్న కృష్ణా వాటర్‌ ఎయిర్‌ పైప్‌లైన్‌ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు అనంతపురం జిల్లాకు చెందినవారు కాగా మరో ముగ్గురు తెలంగాణ వాసులు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల్లో శ్రీనుయాదవ్‌, భరత్‌, శ్రీకాంత్‌రెడ్డి హైదరాబాద్‌ వాసులు కాగా శివభాస్కర్‌, డ్రైవర్‌ నాగేంద్ర ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వారు. కాగా భరత్‌, నాగేంద్రకు ఆరునెలల క్రితం వివాహమైంది. విద్యార్థులంతా ముప్పై సంవత్సరాలలోపు వారే. 


logo