లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఐదుగురు బలి

- బస్సును ఢీకొట్టి.. ఆటోపైకి దూసుకెళ్లి బోల్తా
- ఆటోలోనే నలుగురు దుర్మరణం
- దవాఖానలో చికిత్సపొందుతూ మరొకరు..
- పత్తి ఏరేందుకు వెళ్లే క్రమంలో దుర్ఘటన
- వికారాబాద్ జిల్లా ఇజరాచిట్టంపల్లి వద్ద విషాదం
- మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి హామీ
- మరో రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి
వికారాబాద్: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఐదు నిండు ప్రాణాలను బలితీసుకొన్నది. అతివేగంగా వెళ్తూ ఎదురుగా ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. అదే వేగంతో పక్కనే కూలీలతో నిలిపిఉన్న ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఒకరు దవాఖానలో మృతిచెందారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలోని ఇజరాచిట్టంపల్లి వద్ద శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నది. ఇజరాచిట్టంపల్లికి చెందిన జాటోతు శానియాబాయి(55), రమావత్ సంధ్య(16), జాటోతు సోని (15), జాటోతు నితిన్(14), జాటోతు రేణుకాబాయి (30)తోపాటు మరో ముగ్గురు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో పత్తి ఏరేందుకు వెళ్తుంటారు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం కూడా గ్రామానికి చెందిన హరి ఆటోలో కూర్చున్నారు. మరో ఇద్దరు కూలీలు రాకపోవడంతో వారిని తీసుకొచ్చేందుకు హరి ఆటోను రోడ్డు పక్కన నిలిపి ఊరిలోకి వెళ్లాడు.
అదే సమయంలో మోమిన్‌పేట వైపు నుంచి తాండూర్ వైపు అతివేగంగా వెళ్తున్న లారీ (ఏపీ 28 వై 9596) ఇజరాచిట్టంపల్లి వద్ద ఆగిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అదుపుతప్పి ఆటోపైకి దూసుకొచ్చింది. ఆటోను బలంగా ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న మంకీబాయి ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న శానియాబాయి, సంధ్య, సోని, నితిన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సంధ్య తలభాగం పూర్తిగా చితికిపోయింది. రేణుకాబాయికి తీవ్రగాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందిం ది. నితిన్ తొమ్మిది, సోని పదోతరగతి, సంధ్య ఇంటర్ విద్యార్థులు. మోమిన్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను మర్పల్లి ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ రషీద్ ఇజరాచిట్టంపల్లికి వెళ్లి ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. మర్పల్లి ప్రభుత్వ దవాఖానలో మృతుల కుటుంబీకులను మంత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభు త్వం తరఫున డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు ఇతర సాయం చేయాలని కలెక్టర్ పౌసుమిబసును మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మంత్రి రూ.50 వేలు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రూ.50 వేలు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రూ.25 వేలు తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.
సిద్దిపేట జిల్లాలో బావ, బావమరిది మృతి
కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రవీంద్రనగర్ శివారులో బైక్ డివైడర్‌ను ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన పెద్దోజి రమేశ్ (28) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ హైదరాబాద్ ఉప్పల్‌లో నివాసముంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌కు చెందిన కానుగల సాగర్ (28) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లోని వారాసిగూడలో ఉంటున్నారు. వీరిద్దరు వరుసకు బావమరుదులవుతారు. కరీంనగర్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి శనివారం ఉదయం బైక్‌పై హైదరాబాద్‌కు వస్తున్నారు. రవీంద్రనగర్ శివారులో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ వీరి పైనుంచి వెళ్లింది. దీంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందగా రమేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రమేశ్‌ను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వరంగల్అర్బన్ జిల్లాలో తండ్రీకొడుకులు
ఎల్కతుర్తి: ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి శుభకార్యానికి వెళ్తున్న తండ్రీకొడుకులు మృతిచెందగా, భార్యాకూతురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. మండలంలోని దామెరకు చెందిన కడారి సదానందం(40), కొడుకు కమల్ (9), భార్య స్వప్న, కూతురు శరణ్యతో బైక్‌పై ధర్మసాగర్ వైపు వెళ్తున్నారు. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. ప్రమాదంలో సదానందం, కమల్ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందగా.. భార్య, కూతురు రోడ్డు పక్కన పడిపోయారు. కూతురు శరణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108లో క్షతగాత్రులను వరంగల్ దవాఖానకు తరలించారు. కళ్ల ఎదుటే భర్త, కుమారుడు మృతి చెందడంతో స్వప్న రోదించిన తీరు చూసేవారిని కంటతడి పెట్టించింది.
ఆటో డ్రైవర్ ఇంటిపై దాడి
ప్రమాదానికి కారకుడయ్యాడని ఆటో డ్రైవర్ హరి ఇంటిపై మృతుల కుటుంబీకులు దాడికి దిగారు. ఇంటి పైకప్పు బండలను తీసి పారేశారు. హరి నిర్లక్ష్యంతోనే తమ కుటుంబ సభ్యులు శవాలుగా మారారని ఆందోళన వ్యక్తంచేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను శాంతింపచేశారు.
తాజావార్తలు
- ‘తాండవ్’లో వారి నాలుక కత్తిరిస్తే రూ.కోటి నజరానా:కర్ణిసేన
- వైట్‌హౌస్ ముందు బైడెన్‌కు తొలి అపశృతి!
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం