బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 06, 2020 , 02:37:30

అమ్మాయిని ఎరగా వేసి చంపేశారు

అమ్మాయిని ఎరగా వేసి చంపేశారు
  • ఆభరణాలు, డబ్బు కోసమే చేపల వ్యాపారి దారుణహత్య
  • 24 గంటల్లో నిందితుడి పట్టివేత
  • శవాన్ని దగ్గర పెట్టుకొని రూ.90 లక్షలు అడిగిన నిందితుడు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో చేపల వ్యాపారి రమేశ్‌ దారుణహత్యను నగర పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. తన ఆర్థిక సమస్యల పరిష్కారానికి వ్యాపారి ఆభరణాలు, డబ్బుపై కన్నేసిన దుండగుడు.. అమ్మా యి ఫొటోను ఎరగా వేశాడు. సదరు వ్యాపారి త న గదికి రాగానే ఫూటుగా మద్యం తాగించి సుత్తి తో కొట్టి స్పృహతప్పగానే ఒంటిపై ఉన్న బంగారాన్ని లాక్కొన్నాడు. కిడ్నాప్‌ కథ అల్లి మృతుడి కుటుంబసభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌చేశాడు. వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎస్సార్‌నగర్‌, జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. 


తదుపరి విచారణ కోసం ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడినుంచి విషయాలు రాబడుత్నుట్టు సమాచా రం. ఏజీ కాలనీలోని వికాస్‌పురికి చెందిన చేపల వ్యాపారి రమేశ్‌ (55) ఈ నెల ఒకటో తేదీన ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మరుసటిరోజు ఉదయం మద్యం ఎక్కువగా తాగడం వల్ల వాంతి చేసుకొన్నాడని, నిద్ర లేవగానే తీసుకొచ్చి ఇంటి వద్ద దింపుతామని రమేశ్‌ మేనకోడలు ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చాయి. 


అనంతరం ఫోన్‌ అందుబాటులో లేకుండాపోయింది. రమేశ్‌ కుటుంబసభ్యులు మరుసటిరోజున ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. 3వ తేదీన రమేశ్‌ను కిడ్నాప్‌ చేశామని, రూ.90 లక్షలు ఇస్తే విడిచిపెడతామంటూ మెసేజ్‌లు వచ్చాయి. కిడ్నాప్‌నకు గురయ్యాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. రమేశ్‌ను విడిపించేపనిలో పడ్డారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌ జవహర్‌నగర్‌లోని ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఇంట్లో మృతదేహాన్ని పరిశీలించి.. చనిపోయింది చేపల వ్యాపారి రమేశ్‌గా నిర్ధారించారు. ఆ ఇంట్లో కిరాయికి ఉండే వ్యక్తి పరారైనట్టు గుర్తించారు.


హత్య కోసమే కిరాయికి గది 

రమేశ్‌ ఇంట్లో మల్కాజిగిరికి చెందిన రాజూనాయక్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ ఐదేండ్లు అద్దెకున్నాడు. స్విగ్గి డెలివరీ బాయ్‌గా పనిచేసే రాజూనాయక్‌కు ఇద్దరు భార్యలు. రమేశ్‌తో సన్నిహితంగా ఉంటూ అన్ని విషయాలు పంచుకొనేవాడు. ఆరునెలలక్రితం ఆ ఇంటిని ఖాళీచేసిన రాజునాయక్‌.. తిరిగి మల్కాజిగిరికి వెళ్లిపోయాడు. రమేశ్‌తో స్నే హం కొనసాగిస్తున్నాడు. రాజూనాయక్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో రమేశ్‌నుంచి డబ్బులాగాలని పథకం వేశాడు. 


ఇందులో భాగంగా నెలక్రితం జూబ్లీహిల్స్‌ జవహర్‌నగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకొన్నాడు. ఈ నెల 1న ఒక అమ్మాయి ఫొటోను రమేశ్‌ మొబైల్‌కు పంపి తన గదికి రావాలని పిలిచాడు. అక్కడికి రాగానే రమేశ్‌కు ఎక్కువ మద్యం తాగించి మత్తులోకి జారుకొనేలా చేశాడు. తర్వా త ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొ న్న రాజు.. సుత్తితో తలపై కొట్టి స్పృహకోల్పేయేలా చేశాడు. ఆ రాత్రి మల్కాజిగిరికి వెళ్లిపోయి మరుసటిరోజు బంగారాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తనఖాపెట్టి రూ.1.50 లక్షలు తీసుకొని కొంత డబ్బు భార్యకు ఇచ్చాడు. మరుసటిరోజు సాయంత్రం జవహర్‌నగర్‌కు వెళ్లి చూడగా స్పృహతప్పి పడిపోయిన రమేశ్‌ చనిపోయి కనిపించాడు.


కిడ్నాప్‌ డ్రామా షురూ!

రమేశ్‌ మృతదేహాన్ని అక్కడినుంచి తరలించేందుకు ప్లాన్‌ సిద్ధంచేసిన రాజూనాయక్‌.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి డంపింగ్‌ యార్డ్‌కు తరలించాలనుకొన్నాడు. సికింద్రాబాద్‌లో కత్తి, చెత్తవేసే పెద్ద కవర్లను కొనుగోలు చేశాడు. అనంతరం ఒక మహిళతో కలిసి జవహర్‌నగర్‌ వచ్చి రమేశ్‌ మృతదేహం చేతులు కోశాడు. కాళ్లు కోయడం చేతకాకపోవడంతో సగంలో వదిలేశాడు. దగ్గర్లోని చెత్తకుండీలో వేయాలకున్నా అక్కడ కుక్కలు ఉండటంతో ప్రయత్నం విరమించుకొన్నాడు. మృతదేహం కుళ్లిపోకుండా, వాసనరాకుండా గులాబీ నీళ్లు, అత్తర్లు చల్లి, కిటికీలు, వెంటిలేటర్లను థర్మకోల్‌తో మూసేశాడు. రూ.90 లక్షలు ఇస్తే వదిలేస్తానంటూ మరుసటిరోజు రమేశ్‌ కుటుంబసభ్యులకు రాజూనాయక్‌ వాట్సాప్‌ మేసేజ్‌లు పంపించాడు. 4వ తేదీన రమేశ్‌ కుటుంబసభ్యులు ఎస్సార్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. 


ఒక కేసులో రికవరీచేసిన డబ్బును వీడియో తీసి కుటుంబసభ్యుల ద్వా రా డబ్బు సిద్ధంచేశామనే సమాచారం పంపి కిడ్నాపర్‌ను పట్టుకొనేందుకు పోలీసులు ప్లాన్‌ చేశారు. రేపు వచ్చి తీసుకొంటానని రాజు చెప్పగా.. అదేరోజు రమేశ్‌ హత్య వెలుగులోకి వచ్చింది. రాజూనాయక్‌ కుటుంబ సమేతంగా గుంటూరుకు పారిపోవాలని స్కెచ్‌వేశారు. పోలీసులు వారిని పట్టుకొని విచారిస్తున్నారు. 


logo