ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:21

నది పాలిస్తున్నది

నది పాలిస్తున్నది

నది

ఇప్పుడిప్పుడే బిడ్డలకు పాలిస్తున్నది

గుక్కపెట్టి ఏడుస్తున్న బీడు భూముల 

దేవులాడి బుక్కెడు నీళ్లిస్తున్నది

రొమ్ములెండిన మడులకు నీళ్లు పారుతున్నవి


బిందెడు నీళ్లకై నడిచిన అడుగులల్ల

నీళ్లు దర్జాగా పరుగెత్తుకొస్తున్నయి

చెంగుచెంగున అలలు

పల్లె పల్లెను నవ్వుతూ పలుకరిస్తున్నయి

ఎండకాలంలో అలుగు దుంకుతున్న చెరువులు 

జలహారతులతో పల్లె ఎదలు పులకరిస్తున్నయి


అప్పుడు

నీళ్లమీద మాటల మంటలు

కుట్రల పుట్టలు

శాసన పలకల మీద బ్రహ్మజెముళ్లు 

ఇప్పుడు 

నీటిమీద గింజలు మొలుస్తున్నయి

దీపాలు వెలుగుతున్నయి

పంటలు నవ్వుతున్నయి


దేశంపోయిన దేవుండ్లు

తల్లితావులకు తిరిగొస్తున్నరు

నీళ్ల కాలువలు తెలంగాణ చరిత్రను

పునర్నిర్మాణ వైభవాన్ని ఎత్తిపోస్తున్నయి

ఏండ్ల సంది కరువుతో కూలి పోయినోళ్లకు 

నీళ్లు పండుగలైతున్నయి

- వనపట్ల సుబ్బయ్య


logo