గురువారం 02 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 00:54:42

చేపకు చేవ..ఉపాధికి తోవ

చేపకు చేవ..ఉపాధికి తోవ

  • పైసా ఖర్చులేకుండా చేపల చెరువులు
  • ప్రభుత్వ ఆలోచనతో సత్ఫలితాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా 5,626 చెరువుల తవ్వకం
  • ఇప్పటి వరకు రూ. 281 కోట్ల పనులు
  • ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట జిల్లా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దశాబ్దం పాటు ఉత్తుత్తి పనులతోసాగిన ఉపాధిహామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తెచ్చింది. కూలీలకు పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటుండటం వల్ల నీలివిప్లవానికి బాటలు పడుతున్నాయి. నరేగా కింద రాష్ట్రవ్యాప్తంగా 5,626 చేపల చెరువులు నిర్మితమయ్యాయి. ఇప్పటివరకు రూ.281 కోట్లను వీటి తవ్వకానికి వినియోగించారు. సాగుకే పరిమితమైన రైతు ఇప్పుడు చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నాడు. పైసా ఖర్చులేకుండా తన వ్యవసాయక్షేత్రంలో చేపల చెరువులను తవ్వుకొంటున్నాడు. చేపలను పెంచుతూ లాభాలు గడిస్తున్నాడు. ఈ తరహా చేపల చెరువుల తవ్వకంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ముందున్నది.

కూలీలకు ఉపాధి.. రైతుకు ఊతం

చేపల చెరువుల తవ్వకాన్ని నరేగాతో అనుసంధానం చేయడంతో ఇటు కూలీలకు ఉపాధి లభించడంతోపాటు రైతులపై ఆర్థిక భారం తగ్గుతున్నది. ఎకరం భూమిలో చేపల చెరువు తవ్వాలంటే రూ. 5లక్షలకు పైగా ఖర్చవుతాయి. ఇంత భారీ మొత్తం వెచ్చించి చేపల చెరువులు తవ్విచడం రైతులకు వ్యయప్రయాసలతో కూడుకున్న అంశం.అందుకే ఇన్నాళ్లు మంచినీటి చేపల పెంపకానికి రైతులు ముందుకు రాలేదు. ఇప్పుడు నరేగా కింద పైసా ఖర్చులేకుండా రూ. లక్షల్లో ఖర్చయ్యే చెరువులను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా తవ్విస్తుండటంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. చాలా మంది తమ వ్యవసాయ క్షేత్రాల్లో తవ్వించాలని జిల్లాల్లో ఉపాధి హామీ పీడీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. చేపల చెరువుల తవ్వకంపై రైతుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో రాష్ట్రంలో రాబోయే కాలంలో భారీగానే చేపల చెరువులు తవ్వే అవకాశం ఉంది. దీంతో నిధుల ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని ఉపాధి హామీ పథకం అధికారులు అభిప్రాయపడ్డారు. 


ఊరికో చేపల చెరువు 

చేపల చెరువుల తవ్వకంలో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ జిల్లాలో చేపల చెరువుల తవ్వకం జోరుగా సాగుతున్నది. ఇప్పటి వరకు 45 చెరువులు పూర్తి చేయగా మరో 246 చెరువులు వివిధ దశల్లో ఉన్నా  జిల్లా వ్యాప్తంగా కనీసంగా ఊరికొక చేపల చెరువును తవ్వించేలా ఆ జిల్లా ఉపాధి హామీ అధికారులు ప్రణాళికను రూపొందించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలకేంద్రంలో ఓ రైతు నరేగా ద్వారా చేపల చెరువును తవ్వించి ఏడాదిగా చేపలను పెంచుతున్నాడు. అతనికి మంచి లాభాలు వస్తుండటంతో ఆ గ్రామంలోని మరో 20 మంది రైతులు చేపల చెరువుల తవ్వకానికి దరఖాస్తు చేసుకోవడం విశేషం. 

రైతుల్లో ఆసక్తి 

చేపల చెరువుల తవ్వకాన్ని నరేగాతో అనుసంధానం చేయడంతో రైతుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇప్పటికే పలువురు రైతులు చేపల పెంపకంతో లాభాలు గడిస్తుండటంతో మిగతావాళ్లలో ఆసక్తి పెరిగింది. దీంతో చెరువుల తవ్వకానికి భారీగా దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో ప్రతి గ్రామానికీ కనీసం ఒక చేపల చెరువు తవ్వేలా ప్రణాళికలు రూపొందించాం. సాధారణ వ్యవసాయం కన్నా చేపల పెంపకం లాభదాయకంగా ఉన్నది. 

-గోపాల్‌రావు, జిల్లా ఉపాధి హామీ అధికారి, సిద్దిపేట


logo