నవంబర్ 1 నుంచి డిగ్రీ ఫస్టియర్

- పీజీ ప్రథమ సంవత్సరం కూడా..
- అక్టోబర్ 31కి ప్రవేశాలు పూర్తి
- 2020-21 క్యాలెండర్ విడుదల
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం కోర్సులకు నవంబర్ 1 నుంచి 2020-21 విద్యాసంవత్సరం ప్రారంభించనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు వర్సిటీలను ఆదేశించింది. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్పోక్రియల్ నూతన విద్యాసంవత్సరం క్యాలెండర్ను విడుదలచేశారని వెల్లడించింది. కొవిడ్-19 నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అక్టోబర్ 31 నాటికి డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియను ముగించాలని క్యాలెండర్లో పేర్కొన్నారు. మిగిలిన సీట్లు తిరిగి భర్తీ చేసుకోవడానికి నవంబర్ 30 వరకు గడువు విధించారు.
ఒకవేళ యూనివర్సిటీల్లో ప్రవేశ పరీక్షలు ఆలస్యమైతే నవంబర్ 18 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలా విశ్వవిద్యాలయాలు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆన్లైన్/ఆఫ్లైన్/ బ్లెండెడ్ విధానంలో పాఠాలు బోధిస్తూ విద్యా సంవత్సరాన్ని కొనసాగించుకోవచ్చు. ప్రవేశాలు పొందినతర్వాత.. సీట్లు రద్దు చేయడం, వలస వెళ్లాల్సివచ్చినవారి నుంచి ఒక్కపైసా కూడా తీసుకోకుండా ఫీజు మొత్తం రిఫండ్ చేయాలి. ఇది నవంబర్ 30 వరకు వర్తిస్తుంది. డిసెంబర్ 31లోపు అడ్మిషన్లు రద్దు చేసుకుంటే రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు వసూలుచేస్తామని క్యాలెండర్లో పేర్కొన్నారు.