శనివారం 30 మే 2020
Telangana - May 16, 2020 , 01:07:07

నెలాఖరున కొండపోచమ్మలోకి గోదారమ్మ

నెలాఖరున కొండపోచమ్మలోకి గోదారమ్మ

  • ఆరున్నర కిలోమీటర్ల సమీపంలోకి జలాలు
  • ఈ నెల 18న మొదటి మోటర్‌ ట్రయల్ రన్ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ గజ్వేల్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీబరాజ్‌ నుంచి సుదీర్ఘంగా ప్రయాణించిన గోదావరి జలాలు కొండపోచమ్మకు ఆరున్నర కిలోమీటర్ల సమీపానికి చేరుకున్నాయి. మరో రెండుదశల్లో ఎత్తిపోత ద్వారా ఈ నెలాఖరునాటికి బేసిన్‌లోనే అత్యంత ఎత్తయిన కొండపోచమ్మ జలాశయంలో కొలువుదీరనున్నాయి. తుక్కాపూర్‌ పంపుహౌజ్‌ నుంచి వచ్చిన కాళేశ్వరం జలాలను శుక్రవారం సాయంత్రం అక్కారం పంపుహౌజ్‌లోని సర్జ్‌పూల్‌లోకి వదిలారు. అక్కడ శనివారం నుంచి అధికారులు సాంకేతిక పరిశీలన మొదలుపెట్టనున్నట్టు తెలిసింది. మొదట పంపుహౌజ్‌లోఉన్న ఆరు మోటార్లకు సంబంధించిన డ్రాఫ్ట్‌ట్యూబ్‌ల్లో నీటిని నింపి లీకేజీలను పరిశీలిస్తారు. ఇందుకు రెండురోజులు పట్టే అవకాశం ఉండటంతో ఈ నెల 18న మొదటి మోటర్‌  ట్రయల్ రన్ కు ఏర్పాట్లుచేస్తున్నారు. అక్కడి నుంచి జలాలు కొండపోచమ్మసాగర్‌ దగ్గర ఉన్న మర్కూక్‌ పంపుహౌజ్‌కు చేరుతాయి. మర్కూక్‌లో 34 మెగావాట్లు, 1250 క్యూసెక్కులు ఎత్తిపోసే సామర్థ్యంతో ఆరుమోటార్లు ఉన్నాయి. అక్కడి నుంచి పోచమ్మసాగర్‌లోకి జలాలను పంపించడాన్ని అధికారికంగా నిర్వహించే వీలున్నందున నాలుగు మోటర్ల ద్వారా ఒకేసారి ఐదువేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కారం పంపుహౌజ్‌లో ఆరు, మర్కూక్‌ పంపుహౌజ్‌లోనూ నాలుగు మోటర్లు సిద్ధమయ్యేందుకు 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశమున్నది. దీంతో ఈ నెలాఖరులో కొండ పోచమ్మసాగర్‌లోకి గోదావరిజలాలను ఎత్తిపోసే సూచనలు కనిపిస్తున్నాయి.


logo