వ్యాక్సినేషన్ సక్సెస్

- ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ప్రక్రియ ప్రారంభం
- రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం
- తొలిరోజు 3,962 మందికి
- 1,91,181మందికి తొలిరోజు వ్యాక్సిన్
- సఫాయి కార్మికురాలు కిష్టమ్మకు తొలి టీకా
- గాంధీ దవాఖానలో వ్యాక్సినేషన్ ప్రారంభం
- మొదటి రోజు హెల్త్‌కేర్ సిబ్బందికి ప్రాధాన్యం
- టీకా వేసుకున్నా మాస్కు, దూరం తప్పనిసరి
- నెలలోపు అదే కంపెనీ రెండోడోస్ వేసుకోవాలి
- ఇది దేశం గర్వించదగిన సమయం: ప్రధాని
- ‘దేశమంటే మట్టికాదోయ్' గురజాడ కవిత ప్రస్తావన
- ఏడాది కాలంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా
మహమ్మారిపై అంతిమ యుద్ధం మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత భారీ టీకా కార్యక్రమం దేశంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనాపై నిర్ణయాత్మక యుద్ధం మొదలైందని ప్రకటించారు. ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్న ఈ టీకా కార్యక్రమంలో తొలిరోజు 3,352 కేంద్రాల్లో 1,91,181 మందికి టీకాలు వేశారు. ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో 16,755 మంది ఉద్యోగులు, సిబ్బంది సేవలందించారు. దేశంలో తొలి కరోనా టీకాను ఢిల్లీ ఎయిమ్స్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మనీశ్‌కుమార్ తీసుకొన్నారు. అనేక రాష్ర్టాల్లో టీకా కేంద్రాలను పూల దండలతో అలంకరించారు. టీకా బాక్సులకు పూజలు చేశారు. మన రాష్ట్రంలో టీకా కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. గాంధీ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్.. టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ దవాఖానలో పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు మొదటి టీకా వేశారు. తొలిరోజు రాష్ట్రంలో 140 కేంద్రాల్లో 3,962 మందికి వ్యాక్సిన్ వేశారు.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సంయుక్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. కరోనా కష్టకాలంలో ముందుండి సేవలందించిన వారికి గౌరవసూచకంగా మొదటిరోజు హెల్త్‌కేర్ వర్కర్లకు టీకాలు వేశారు. తొలి టీకాను గాంధీ దవాఖానలో పా రిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న కిష్టమ్మకు వేశారు. ఈ సమయంలో అందరూ చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10.30 గంటలకు వ్యా క్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగింది. తొలిరోజు 140 కేంద్రా ల్లో 3,962 మంది ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బందికి టీకాలు వేసినట్టు వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. నిమ్స్ దవాఖానలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, తిలక్‌నగర్ పీహెచ్సీలో మంత్రి కేటీఆర్, జిల్లాల్లో పలువురు మంత్రులు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. గాంధీ దవాఖాన, నార్సింగిలోని ఆరోగ్య కేం ద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పరిశీలించారు.
విజయవంతంగా ముగిసిన ప్రక్రియ
రాష్ట్రంలో తొలిరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఎక్కడా పెద్ద సమస్యలు తలెత్తలేదని వైద్యారోగ్య వర్గాలు తెలిపాయి. టీకా వేసుకున్న తర్వాత 11 మం దిలో మాత్రమే చెమటలు రావటం, అలసట, నొప్పి వంటి ప్రాథమిక లక్షణాలు తప్ప ఎక్క డా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవని అధికారులు ప్రకటించారు. భారత చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా నిర్వహించడం ఇదే ప్రథమం. కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పటికీ వెంటనే పరిష్కరించారు. రాష్ట్రంలో 80 లక్షల మంది వరకు హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లు, 50 ఏండ్ల పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
రేపటి నుంచి కొనసాగింపు
కరోనా వ్యాక్సినేషన్ సోమవారం నుంచి వారానికి నాలుగురోజులపాటు కొనసాగనుంది. ఇం దుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం దాదాపు 500 సెంటర్లలో ప్రక్రియను ప్రారంభించి, ద శలవారీగా పెంచనున్నారు. టీకాలు వేసుకునే లబ్ధిదారుల సంఖ్యను కూడా రోజు 100 వర కు పెంచనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకు న్న వారిలో రెండున్నర లక్షల మంది వరకు హెల్త్‌కేర్ వర్కర్లు ఉన్నట్టు తెలుస్తున్నది.తొలిదశలో రాష్ట్రానికి 3.64 లక్షల కొవిషీల్డ్, 20వేల కొవాగ్జిన్ టీకాలు వచ్చాయి. మరో 28 రోజుల అనంతరం రెండో డోస్ వేయాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌లో 417 మందికి వ్యాక్సిన్
తొలిరోజు అత్యధికంగా హైదరాబాద్‌లో 417 మంది హెల్త్‌కేర్ వర్కర్లు టీకాలు వేసుకున్నారు. ఆదిలాబాద్‌లో 90, భద్రాద్రి కొత్తగూ డెం 113, జగిత్యాల 38, జనగాం 60, జయశంకర్ భూపాలపల్లి 90, జోగుళాంబ గద్వాల 120, కామారెడ్డి 175, కరీంనగర్ 120, ఖమ్మం 170, కుమ్రంభీం ఆసిఫాబాద్ 90, మహబూబాబాద్ 115, మహబూబ్‌నగర్ 120, మంచిర్యాల 60, మెదక్ 40, మేడ్చల్ మల్కాజ్గిరి 295, ములుగు 40, నాగర్‌కర్నూల్ 60, నల్లగొండ 83, నారాయణపేట 77, నిర్మల్ 90, నిజామాబాద్ 180, పెద్దపల్లి 90, రాజన్న సిరిసిల్ల 120, రంగారెడ్డి 235, సంగారెడ్డి 144, సిద్దిపేట 66, సూర్యాపేట 80, వికారాబాద్ 90, వనపర్తి 120, వరంగల్ రూరల్ 104, వరంగల్ అర్బన్ 180, యాదాద్రి భువనగిరిలో 90 మంది వ్యాక్సిన్ వేసుకున్నట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
పోరాట యోధులకే ప్రాధాన్యం
కరోనా కష్టకాలంలో ప్రజలను కాపాడేందుకు హెల్త్‌కేర్ వర్కర్లు ఎంతో శ్రమించారు.. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. అందుకే ముందుండి పోరాటం చేసిన దవాఖాన పారిశుద్ధ్య కార్మికులకు తొలి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. అందుకే తొలి టీకా వారికే ఇచ్చాం.
-ఆరోగ్యశాఖ మంత్రి ఈటల
ధైర్యంగా వేసుకున్న
అందరికన్నా ముందు నేను టీకా వేసుకోవడం ఆనందంగా ఉన్నది. టీకా వేసుకున్నంక వైద్యులు దగ్గరుండి నా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నరు. నేను ఏడాది నుంచి కరోనా రోగుల వార్డులో పనిచేస్తున్నా. మూడు రోజుల నుంచి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మా అందరికి ఎంతో ధైర్యం చెప్పిన్రు. మా పిల్లలు కూడా ధైర్యం చెప్పిన్రు. నేను దమ్మాయిగూడ అంబేద్కర్‌నగర్‌లో ఉంటాను. 14 ఏండ్లుగా గాంధీ దవాఖానలో సఫాయి కార్మికురాలిగా పనిచేస్తున్న. అందరూ ధైర్యంగా టీకాలు వేసుకోవాలె.
- కిష్టమ్మ, రాష్ట్రంలో మొదటి టీకా వేసుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు
కొంచెం టెన్షన్‌కు గురయ్యా..
మాక్లూర్ పీహెచ్సీలో మొదటి టీకా నాకే ఇవ్వడంతో కొంచెం టెన్షన్‌కు గురయ్యా. మొదటి టీకా నేనే తీసుకోవడం ఆనందంగా ఉంది. టీకా తీసుకున్న తర్వాత ఇబ్బందికి గురికాలేదు.
-బీ అరుణ, ఏఎన్ఎం, చిక్లీ సబ్‌సెంటర్, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా
అయినా భయపడలే..
నస్పూర్ ఆయుష్ దవాఖానలో పనిచేస్తున్న. నాకు కరోనా వైరస్ అంటుకున్నది. నేను షుగర్ పేషెంట్‌ను. అయినా భయపడలే. నేను టీకా వేసుకున్న. ఏం కాలే.
- అరిగెల కిషన్, అటెండర్, నస్పూర్ ఆయుష్ దవాఖాన
గర్వంగా ఫీలవుతున్నా..
కరోనా వ్యాక్సిన్ టీకా మొదట వేయించుకోవడం గర్వంగా ఫీలవుతున్నా. టీకా వేయించుకున్నా తర్వాత ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఎవరూ భయపడొద్దు.. ఎవరికేమీ కాదు.
- చందునాయక్, జోగుళాంబ గద్వాల జిల్లా వైద్యాధికారి
టీకా రావడం సంతోషం
ప్రభుత్వం మా సేవలను గుర్తించి వ్యాక్సిన్ వేయించడం ఆనందంగా ఉంది. ములుగు జిల్లాలో తొలి టీకా నేను వేసుకున్నందుకు గర్వపడుతున్నా. కొవిడ్ నివారణ టీకా రావడం సంతోషమే.
- బల్గూరి కుమార్, ములుగు జిల్లా దవాఖాన పారిశుద్ధ్య కార్మికుడు
ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉన్నా
సిద్దిపేటలో తొలి టీకా వేసుకున్నందుకు సంతోషంగా ఉన్న. ఎలాంటి ఆందోళన లేదు. చాలా ఆత్మవిశ్వాసంతో టీకా వేసుకున్న. ఇది నా జీవితంలో గొప్ప సంఘటన. 10 నెలల నుంచి ఇక్కడే కొవిడ్ వార్డులో సేవలందిస్తున్న. వార్డులోనే కరోనా నిరోధక టీకా వేసుకున్నందుకు గర్వంగా ఉంది. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.
- డాక్టర్ సారస్మిత, సిద్దిపేట
ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు
జిల్లా దవాఖానలో హెడ్‌నర్సుగా పనిచేసుకున్నా నేను తొలి టీకా వేసుకున్నాక ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. వ్యాక్సిన్ అందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
-సూర్యపోగు మేరి, హెడ్ నర్సు, జిల్లా ప్రధాన దవాఖాన, ఖమ్మం
అనుమానాల నివృత్తికే ముందుకొచ్చా
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు టీకా వచ్చేసింది. కానీ వేయించుకునేందుకు చాలామంది భయపడుతున్నారు. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలిగించేందుకు టీకా వేయించుకున్నా. ఎలాంటి సైడెఫెక్టులు కలుగలేదు. చాలా సంతోషంగా ఉన్నా.
-ఏఎన్ఎం యాదమ్మ, నార్సింగి ఆరోగ్య కేంద్రం
డాక్టర్లు అభయం ఇచ్చిండ్రు..
ఇక్కడ నేనే మొదటి టీకా తీసుకున్నా. మంత్రి కేటీఆర్ సమక్షంలో టీకా తీసుకోవడం సంతోషంగా ఉన్నది. డాక్టర్లు ఎంతో ధైర్యం చెప్పారు. వారిచ్చిన సలహాతోనే టీకా తీసుకున్నాను. భయమేమీ లేదు.
-రేణుక, స్వీపర్, తిలక్‌నగర్ యూపీహెచ్సీ
కరోనాపై భయం పోయింది
దవాఖానలో పనిచేస్తున్నప్పటికీ కరోనా అంటే ఎంతో భయం ఉండేది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగం చేసేవాడిని. అయినా కొవిడ్ బారిన పడ్డ. తర్వాత కోలుకున్న. తొలిరోజు 30 మందిలో ఒకడినై కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతో కరోనాపై భయం పోయింది.
-రవి, కోఠి ఈఎన్టీ ఉద్యోగి
తాజావార్తలు
- ఖలిస్తాన్ గ్రూపుల బెదిరింపు : కెనడాలో హిందువులపై దాడుల పట్ల ఆందోళన
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్‌కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం
- అక్షర్‌తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి