బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 02:49:44

ఏపీలో తొలి కరోనా మరణం

ఏపీలో తొలి కరోనా మరణం

-164కి పెరిగిన బాధితుల సంఖ్య 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైందని వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. ఒక్కరోజే 12 కేసులు నమోదయ్యాయని, దీంతో వైరస్‌ బాధితుల సంఖ్య 164 పెరిగిందని తెలిపింది. ఢిల్లీలో మతప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. కొత్తగా నెల్లూరు జిల్లాలో 8, విశాఖలో 3 కేసులు నమోదయ్యాయి. విజయవాడలో 55 ఏండ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో బాధపడుతూ మృతి చెందాడు. కుమారుడి నుంచి తండ్రికి వైరస్‌ సోకిందని, బాధితుడికి హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ ఉన్నాయని వైద్యులు తెలిపారు. అతని కుమారుడు ఢిల్లీలో మత పరమైన ప్రార్థనలకు హాజరై మార్చి 17న ఇంటికి వచ్చాడని, మార్చి 30న అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని చెప్పారు. మరోవైపు కరోనాపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీలో మతప్రార్థనలకు వెళ్లివచ్చినవారే ఉన్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన 164 కేసుల్లో 140 మంది ఢిల్లీ మతప్రార్థనలతో సంబంధం ఉన్నవారేనన్నారు. కాగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎస్మా  అమలు చేసింది. ఆరు నెలలపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సేవలు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని దీని పరిధిలోకి తీసుకువచ్చారు. logo