మంగళవారం 26 మే 2020
Telangana - May 19, 2020 , 01:42:37

పోతిరెడ్డిపాడుపై ఏపీ వితండవాదం

పోతిరెడ్డిపాడుపై ఏపీ వితండవాదం

  • తమ ప్రాజెక్టు ఊసెత్తకుండా తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు
  • గోదావరి ప్రాజెక్టులపైనా కృష్ణా బోర్డు చైర్మన్‌ముందు వాదన
  • నేడు ఇరు రాష్ర్టాల అధికారులతో బోర్డు చర్చించే అవకాశం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మళ్లీ అడ్డదిడ్డమైన వాదనే వినిపించింది. కృష్ణా రివర్‌ బోర్డు ముందు తమ ప్రాజెక్టు విస్తరణపై వివరణ ఇవ్వకుం డా తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేసింది. ‘శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ఎత్తిపోతల ద్వారా మూడు టీఎంసీలు సహా పోతిరెడ్డిపాడు విస్తరణతో పది టీఎంసీల కృష్ణాజలాలను పెన్నా బేసిన్‌ కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు జీవో 203 ద్వారా పాలన అనుమతిచ్చిందని, ఏపీ పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధం’ అని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్‌బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బోర్డు.. ఏపీ జలవనరులశాఖను వివరణ కోరగా సోమవారం మధ్యాహ్నం ఆ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఈఎన్సీ నారాయణరెడ్డి జలసౌధలోని కృష్ణాబోర్డు కార్యాలయంలో బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడకుండా తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశారు. కేటాయింపులకు లోబడే తాము కృష్ణాజలాలను వాడుకుంటామని బోర్డు చైర్మన్‌కు స్పష్టం చేసినట్లు ఆదిత్యనాథ్‌దాస్‌ మీడియాకు తెలిపారు. తమ కొత్త ప్రాజెక్టుపై బోర్డు కు లిఖితపూర్వకంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 

కృష్ణా ప్రాజెక్టుల గురించి అడిగితే గోదావరి ప్రాజెక్టులపై ఫిర్యాదు

కృష్ణానదిపై అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి రివర్‌బోర్డు వివరణ కోరితే ఏపీ అధికారులు తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులపై ఫిర్యా దు చేయటం విడ్డూరం. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, మిషన్‌ భగీరథ, తుమ్మిళ్ల వంటి కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీకి  నీటి కేటాయింపులను పెంచిందంటూ ఫిర్యాదు చేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలపై 2016, సెప్టెంబర్‌లో అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన సీఎం కేసీఆర్‌, నాటి ఏపీ సీఎం చంద్రబాబుతో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించగా ఇవి పాత ప్రాజెక్టులేనని సమగ్ర ఆధారాలను కేసీఆర్‌ కేంద్రం ముందుంచారు. వాటిపై మళ్లీ బోర్డుకు ఫిర్యాదుచేయటంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

నేడు రెండు రాష్ర్టాలతో బోర్డు చర్చలు

ఏపీ కొత్త ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించడంతోపాటు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కూడా స్పష్టమైన ఆదేశాలివ్వటంతో ఈ అంశంపై కృష్ణా బోర్డు అధికారులు సోమవారం చర్చించినట్లు తెలిసింది. మంగళవారం రెండు రాష్ర్టాల అధికారులతో సంప్రదింపులు జరుపనున్నట్టు సమాచారం. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చే యాలా? లేదంటే ఇరు రాష్ర్టాల అంగీకారంతో బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలా? అనే అంశంపై అభిప్రాయ సేకరణకోసం రెండు రాష్ర్టాలకు లేఖలు రాయనున్నట్టు తెలుస్తున్నది. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తప్పేలాలేదనే అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్టు సమాచారం. 

ప్రాజెక్టుల సమాచార సేకరణలో కేంద్రం

అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించే పక్షంలో అవసరమయ్యే సమాచారాన్ని ముందుగానే సేకరించే పనిలో కేంద్ర జలశక్తి అధికారులు నిమగ్నమయ్యారు. గత నాలుగేండ్లుగా రెండు రాష్ర్టాల్లో కృష్ణాజలాల వినియోగం, ప్రాజెక్టులవారీగా వినియోగం, మొత్తం కేటాయింపులు తదితర వివరాలివ్వాలని బోర్డును ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకు కృష్ణాబోర్డు నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. పోతిరెడ్డిపాడుకు కేవలం 19 టీఎంసీలు కేటాయించగా ఏఏ సంవత్సరంలో ఎంత నీటిని వాడుకున్నారనే వివరాలు ఉన్నాయి. 


logo