సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 02:20:38

కరోనాతో కాళ్లలో మంటలు

కరోనాతో కాళ్లలో మంటలు

  • l ప్రాణాంతకంగా మారుతున్న రక్తం గడ్డలు 
  • l 25-30 శాతం రోగుల్లో పల్మనరీ థ్రాంబోసిస్‌ 
  • l చికిత్స ఆలస్యమైతే కాళ్లు తొలిగించాల్సిందే 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సోకినవారిలో రక్తం గడ్డ కట్టే సమస్య ఇటీవల తీవ్రమవుతున్నది. కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టడాన్ని (పల్మనరీ థ్రాంబోసిస్‌)గతంలోనే గుర్తించారు. వైరస్‌ సోకి దవాఖానల్లో చేరిన 25-30శాతం మందిలో రక్తం గడ్డకడుతున్నట్టు తెలుస్తున్నది. రక్తం గడ్డకట్టడం వల్ల ఆయా అవయవాలకు రక్త ప్రసరణ నిలిచిపోతున్నది. ఫలితంగా అవి చచ్చుబడిపోతున్నాయి. మెదడు, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలకు రక్తం చేరకపోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నది. 

హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు జాగ్రత్త 

గడ్డకట్టిన రక్తం కాళ్లలోకి చేరినవారికి కాళ్లల్లో, పాదాల్లో విపరీతమైన నొప్పులు వస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. వీరికి సకాలంలో వైద్యం అందకుంటే కాలు తీసేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కరోనా సోకి ఇంట్లోనే చికిత్స పొందుతున్నవారు పాదాల్లో మంటలు వస్తే వెంటనే దవాఖానకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఆలస్యంగా రావడం వల్ల జూలైలోనే ఆరుగురికి కాళ్లు తీసేయాల్సి వచ్చిందని హైదరాబాద్‌లోని ఓ వైద్యుడు తెలిపారు. కాళ్లలో మంటలతోపాటు ఊపిరి రేటు నిమిషానికి 20 కన్నా తక్కువగా, ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్‌ లెవల్స్‌ 93 కన్నా తక్కువగా ఉంటే థ్రాంబోసిస్‌గా గుర్తించాలన్నారు. వైద్యులు సైతం వెంటనే రక్తం గడ్డకట్టడాన్ని నివారించే మందులు ఇవ్వాలని సూచిస్తున్నారు. 

  • l రక్తం గడ్డలు మెదడుకు చేరితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుంది. 
  • l ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తం సరఫరాను అడ్డుకుంటే కంపార్ట్‌మెంట్‌ సిండ్రోమ్‌ వచ్చి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. 
  • l నరాల్లో ఉంటే డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌ (డీవీటీ), రక్తనాళాల్లో ఉంటే ఎక్యూట్‌ లింబ్‌ ఇష్కేమియా వస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. 

ఆలస్యంగా దవాఖానకు వస్తే ప్రమాదం

గత నెలలో మా దగ్గరికి వచ్చిన బాధితుల్లో 14 మందిలో కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం చూశాం. కొందరు ఆలస్యంగా రావడం వల్ల ఆరుగురికి కాళ్లు తీసేయాల్సి వచ్చింది. ముగ్గురికి డీవీటీ ఏర్పడి సివియర్‌ కంపార్ట్‌మెంట్‌ సిండ్రోమ్‌తో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి విపరీతమైన కాళ్లనొప్పులు, శ్వాససరిగా అందకపోవడం వంటి లక్షణాలుంటే వెంటనే దవాఖానకు వెళ్లాలి. ఆరోగ్యవంతుల్లోనూ రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉంటాయి. చిన్న జాగ్రత్తలతో దీనిని అధిగమించవచ్చు. ఎప్పుడూ మంచం మీదే విశ్రాంతి తీసుకోవద్దు. ఎక్కువగా నీళ్లు తాగాలి. కాలి వ్యాయామాలు, ఊపిరితిత్తుల వ్యాయామాలు చేయాలి. -డాక్టర్‌ నరేంద్రనాథ్‌, కిమ్స్‌ హాస్పిటల్‌ logo