గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 02, 2020 , 19:56:58

అగ్ని ప్రమాదం కాదు.. మాక్‌ డ్రిల్‌ : సీఎండీ ప్రభాకర్‌రావు

అగ్ని ప్రమాదం కాదు.. మాక్‌ డ్రిల్‌ : సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌ : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో మళ్లీ అగ్ని ప్రమాదం జరిగిందనే వార్తలు కలకలం రేపాయి. అయితే ప్రమాదం జరిగితే సిబ్బంది ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకు మాక్‌డ్రిల్‌ నిర్వహించామని తెలుపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌ కేంద్రంలో ఒక్కసారి మంటలు చెలరేగడంతో నిజమైన అగ్ని ప్రమాదమనుకొని సిబ్బంది పరుగులు తీశారు. చివరకు మాక్‌డ్రిల్‌గా తేలడంతో సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. సిబ్బంది ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకు రహస్యంగా ఈ పరిశీలన జరిపినట్లు ట్రాన్స్‌కో, జెన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.  తాను ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రానికి వెళ్లానని, ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలిపేందుకే ఈ మాక్‌డ్రిల్‌ నిర్వహించినట్లు స్పష్టం చేశారు. 

సివిల్‌ డైరెక్టర్‌ అజయ్‌తో కలిసి మాక్‌డ్రిల్‌ను రహస్యంగా నిర్వహించామని ప్రభాకర్‌రావు చెప్పారు. కేవలం డైరెక్టర్లకు మాత్రమే సమాచారం ఉందని, విద్యుత్‌ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి తెలియనివ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఒక వేళ అగ్ని ప్రమాదం జరిగితే సిబ్బంది ఎలా వ్యవహరిస్తారోనని తెలుసుకునేందుకు సీఎండీతో సహా పలువురు డైరెక్టర్లు అత్యంత గోప్యంగా మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. మంటలు చెలరేగినప్పుడు డైరెక్టర్లు మాత్రం అక్కడే ఉండిపోయారు.

గత నెల 20వ తేదీన జల విద్యుత్‌ ఉత్ప త్తి కేంద్రంలో 9 మంది సిబ్బంది, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అగ్నిప్రమాదం సమయంలో ఎటు వెళ్లాలి.. ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి.. అనే విషయం తెలియక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు భావిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo