శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 03:21:23

అప్పుల నుంచి ఆత్మగౌరవం వైపు

అప్పుల నుంచి ఆత్మగౌరవం వైపు

  • ఆర్థికంగా నిలదొక్కుకున్న తెలంగాణ రైతు  
  • అన్నదాతకు అండగా ప్రభుత్వ పథకాలు 
  • ఏటా రుణపరిమితి పెంచుతున్న ప్రభుత్వం
  • అయినా రుణాలు తీసుకునేందుకు రైతన్న నిరాసక్తత

ఉమ్మడి ఏపీలో అప్పులు తప్ప ఆదాయం కండ్ల చూడని తెలంగాణ రైతన్న.. స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంవైపు అడుగులు వేస్తున్నాడు. ప్రతిరైతును ధనికుడ్ని చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల అండతో ఆర్థికంగా బలోపేతమవుతున్నాడు. అప్పులు తీసుకొనేస్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను వడ్డీ వ్యాపారులకు అప్పజెప్పకుండా.. నేరుగా ఇంటికి తరలించి గాదెలు నింపుకొంటున్నాడు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ చేయూత ఒకవైపు.. విస్తారమైన పంటలు తెచ్చిన లాభాలు మరోవైపు.. వెరసి.. రాష్ట్ర రైతు ఆర్థికంగా బలపడుతున్నాడు. యాసంగి పంటల విక్రయం, రుణమాఫీ, రైతుబంధు సాయం కలిపి దాదాపు రూ.32 వేల కోట్ల సొమ్ము రైతుల వద్ద ఉన్నది. వానకాలం సీజన్‌కుగాను పంట పెట్టుబడి సాయం కింది ప్రతిరైతుకు ఎకరాకు రూ.5 వేల చొప్పున సుమారు 58 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.7,500 కోట్లు జమచేసింది. అదేవిధంగా యాసంగిలో రూ.13,787 కోట్లతో యాసంగి పంటనూ కొనుగోలు చేసింది. ఈ మొత్తం డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రూ.11,093 కోట్ల పంట రుణాలనూ మాఫీ చేసింది.

మూడున్నరేండ్లలో 1.13లక్షల కోట్ల రుణం

రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి  మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒకవైపు పంట పెట్టుబడికి సాయం అందిస్తూనే బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నది. గత మూడున్నరేండ్లలో రూ.1,13,363 కోట్లు రుణాలుగా అందజేసింది. రుణపరిమితిని కూడా ప్రతిఏటా పెంచుకుంటూ వస్తున్నది. 2017-18లో రూ.31,410 కోట్లు, 2018-19లో రూ.33,752 కోట్లు, 2019-20లో రూ.37,108 కోట్లు రుణాలు ఇచ్చింది. 2020-21లో ఆగస్టు 4వరకు రూ.11,093 కోట్లు బ్యాంకు రుణాలుగా అందజేసింది. అదేవిధంగా రుణాలు తీసుకుంటున్న రైతుల సంఖ్యకూడా పెరుగుతున్నది. 2018-19లో 35 లక్షల మంది, 2019-20లో 38.50 లక్షల మంది రుణాలు తీసుకోగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12.96 లక్షల మంది రుణాలు పొందారు. బ్యాంకులు నేరుగా రుణాలు అందజేస్తుండటంతో గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల హవా తగ్గింది. గతంలో ఓ వెలుగు వెలిగిన వడ్డీ వ్యాపారులు నేడు నామమాత్రంగా మిగిలిపోయారు.

పెరిగిన ఆర్థిక క్రమశిక్షణ

తెలంగాణ రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. అవసరం లేకపోయినా అప్పులు చేయడం, విచ్చలవిడి ఖర్చులు పూర్తిగా తగ్గించారు. అప్పుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉంటున్నారు. అత్యవసరమైతే తప్ప అప్పుచేయడం లేదు. కొంతమంది రైతులు అవకాశం ఉన్నప్పటికీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనేందుకు కూడా ఇష్టపడటం లేదు. అటు ఆదాయం.. ఇటు పొదుపుతో తెలంగాణ రైతు దేశంలోనే ధనిక రైతుగా మారుతున్నాడు.

తెలంగాణ రైతుకు ఆర్థికస్వావలంబన: మంత్రి నిరంజన్‌రెడ్డి

గతంలో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడిన తెలంగాణ రైతాం గం నేడు ఆర్థికస్వాలంబన సాధించింది. తె లంగాణ రైతును దేశంలోనే ధనిక రైతుగా మార్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ప్రభుత్వం.. రైతు వ్యవసాయం చేసేందుకు పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతుల పంటలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు అందిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రైతాంగం ఎంతో సంతోషంగా ఉన్నది.logo